విమానాల్లో వైరస్ల వ్యాప్తి సులభం కాదు
ఎక్కువ శాతం వైరస్లు, రోగకారక ఇతర క్రిములు విమానాల్లో అంత సులభంగా వ్యాప్తి చెందవని అమెరికా చెందిన వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) పేర్కొంది. కరోనా ముప్పు నేపథ్యంలో విమాన ప్రయాణాలకు సంబంధించి ఆ సంస్థ తాజా ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసింది. విమానాల్లో భౌతిక దూరం పాటించాలని అందులో సిఫార్సు చేయకపోవడం గమనార్హం. చాలా వైరస్లు, రోగకారక సూక్ష్యజీవులు విమానాల్లో సులభంగా వ్యాప్తి చెంద లేవు. లోహ విహంగాల్లో గాలి ప్రసరించే, ఫిల్టర్ అయ్యే తీరే అందుకు కారణం అని సీడీసీ తెలిపింది. అయితే కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణికులకు ముప్పు ఉండదని తాము చెప్పట్లేదని సృష్టం చేసింది. విమానాల్లో ప్రయాణించాలంటే తనిఖీల వరుసల్లో చాలా సమయం ఉండాలి. అప్పుడు పలు ఉపరితలాలను తాకాల్సి వస్తుంది. ప్రయాణ సమయంలో గంటలకొద్ది ఇతరులతో కలిసి కూర్చోక తప్పదు. ఫలితంగా కరోనా ముప్పు పెరగొచ్చు అని సీడీసీ పేర్కొంది.













