గడిచిన వందేళ్లలో ఎన్నడూ చూడనంత.. అమెరికాలో
గడిచిన వందేళ్లలో ఎన్నడూ చూడనంతటి కార్చిచ్చు అమెరికాను గడగడ వణికిస్తోంది. కొన్ని రోజుల క్రితం హవాయీ దీవుల్లోని అడవుల్లో చెలరేగిన మంటలు ఇంకా చల్లారలేదు. వేగంగా వీస్తున్న గాలులతో నగరాలకు విస్తరిస్తున్నాయి. మౌయి దీవిలో విలాసవంతమైన రిసార్టులకు ప్రసిద్ధి కెక్కిన నగరం లహాయ్న కార్చిచ్చు కారణంగా పూర్తిగా బుగ్గి అయింది. ఈ నగర పునర్మిర్మాణానికి 5.5 బిలియన్ డాలర్లు (రూ.45,626 కోట్లు) అవసరం అవుతాయని అంచనా. కార్చిచ్చు కారణంగా లహాయ్నాలో 2,200 ఇళ్లు కాలిపోయాయి. 2,100 ఎకరాల్లో అడవి బుగ్గిలా మారింది. ఇదిలా ఉండగా మౌయి దీవిలో కార్చిచ్చు మృతుల సంఖ్య 93కు పెరిగింది. మృతుల సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందని హవాయీ గవర్నర్ తెలిపారు. కాగా 2018లో కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చులో 85 మంది చనిపోయారు. గడిచిన వందేళ్లలో ఇంతటి తీవ్రమైన కార్చిచ్చును చూడలేదని అమెరికా ఫైర్ డిపార్ట్మెంట్ ప్రకటించింది.













