ఎపి అభివృద్ధిలో భాగస్వాములు కండి – మన్నవ సుబ్బారావు

నవాంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎన్నారైలు కూడా భాగస్వాములు కావాలని టీడిపి నాయకుడు, గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు పిలుపునిచ్చారు.
చికాగో నగరానికి చెందిన ఎన్నారై తేదేపా నాయకులు ఆలోకం సురేష్ ఆధ్వర్యంలో చికాగో ఎన్నారై తెలుగుదేశం పార్టీ సమావేశం ఇటీవల జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మన్నవ సుబ్బారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వచ్ఛంద సేవ చేస్తున్న ప్రవాసాంధ్రుల త్యాగనిరతి వెలకట్టలేనిదన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి నూతన రాజధాని నిర్మాణములో భాగస్వాములు కావాలని హాజరైన వారిని కోరారు. ప్రవాసాంధ్రులను కలుపుకుపోతూ వారికి సేవలందించడమే లక్ష్యంగా పలు కార్యక్రమాలను చేపడుతూ, ప్రవాసుల మన్నలను అందుకోవటంలో చికాగో ప్రవాసాంధ్ర తెలుగుదేశం పార్టీ ముందుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని ప్రపంచానికి తెలియజేస్తూ రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని మరింత అభివృద్ధికి దోహదపడాలన్నారు. ప్రవాసాంధ్రులు కలిసికట్టుగా మరిన్న సామాజిక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా జన్మభూమి కీర్తిని దశదిశలా వ్యాపింపజేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ విజయంలో ప్రవాసాంధ్రులు అందించిన సహకారం మరువలేనిదన్నారు.
ఈ సందర్భంగా చికాగో ఎన్నారై తెలుగుదేశం ప్రతినిధులు మాట్లాడుతూ ధరలు పతనమై సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న మిర్చిరైతులను ఆదుకొని, చందన్న రైతు రాయితీ పథకము ప్రవేశపెట్టారని, ఆ పథకం విజయవంతమవడంలో చైర్మన్ మన్నవ సుబ్బారావు కీలకపాత్ర పోషించారన్నారు. మిర్చి రైతులను ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శగా నిలిచిందన్నారు. చికాగో ఎన్నారై తెలుగుదేశం పార్టీ విభాగం తరపున గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చికాగో ఎన్నారై విభాగం అధ్యక్షులు హేమ, సాంభశివరావు, తేజ ఏర్నేని, ప్రవీణ్ కొడాలి, కొమ్మనేని శ్రీనివాసరావు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.











































































