ప్రధాని మోదీకి విందిచ్చిన కమలా హారిస్
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ప్రధాని నరేంద్ర మోదీకి గౌరవార్థం విందు ఇచ్చారు. శ్వేతసౌధంలోనే ఈ విందు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ భారత సంతతికి చెందిన కమలా హారిస్‌పై మోదీ ప్రశంసలు కురిపించారు. భారత్, అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో మీ కృషి అపారం. రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాల ఆధారంగా నిర్మితమైన తీయని బంధమే ఇది అని అన్నారు. అధునాతన టెక్నాలజీలపై మరింత విశ్వాసంతో భారత్, అమెరికా కలిసి పని చేస్తున్నాయని పేర్కొన్నారు. రెండు దేశాలు మరింత విస్తృత ప్రాతిపదికన రక్షణ, వ్యూహాత్మక రంగాల్లో సహాకారం అందించుకోనున్నాయని తెలిపారు. తనకు ఆతిథ్య మిచ్చిన అమెరికా నాయకత్వానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు.













