ATA: ఆటా సాహిత్య సదస్సు 2025.. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్ల సాహిత్య సమాలొచన
ATA: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో డిసెంబర్ 14, 2025, ఆదివారం… హైదరాబాద్లో అద్భుతమైన ‘ఆటా అంతర్జాతీయ సాహిత్య సదస్సు 2025’ నిర్వహించబోతున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుకు 2024 జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్ల ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన తన సాహిత్య ప్రస్థానం, కవితలు, కథలు, నవలలు, వ్యాసాలపై ప్రముఖ సాహిత్యవేత్తలు, పండితులు, భాషావేత్తలతో కలిసి లోతైన చర్చ, సాహిత్య సమాలొచన జరపనున్నారు.
సదస్సు ముఖ్య ఉద్దేశం:
థీమ్: ATA – A New Path Toward a New Tradition (కొత్త సంప్రదాయం వైపు కొత్త బాట)
సంస్కృతుల కలయిక: వివిధ సంస్కృతులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి పరస్పర అవగాహనను పెంచడం.
సృజనాత్మకత: తెలుగు వేదికపైకి ఇతర భాషలకు చెందిన సృజనాత్మక ప్రతిభను పరిచయం చేయడం.
సాహిత్య అనుభవం: లెజెండరీ రచయిత ఆలోచనలను, భారతీయ సాహిత్యాన్ని ప్రపంచ వేదికపై అనుభూతి చెందడం.
ఈ సదస్సులో ఆయన జీవిత చరిత్ర, రచనలు, సాహితీ ప్రక్రియలు, అనువాదాలపై చర్చలు జరగనున్నాయి. భాషా పరిమితులు లేకుండా, వినోద్ కుమార్ శుక్ల రచనల్లోని సరళమైన, శక్తివంతమైన శైలి, మానవ సంబంధాలు, జీవన వాస్తవాలు, భావోద్వేగాలను పండితులు, విద్యావేత్తలు విశ్లేషించనున్నారు.
“చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు కలవాలి. సంస్కృతులు ఒకదానికొకటి అర్థం చేసుకున్నప్పుడే పెరుగుతాయి. వివిధ సంస్కృతులను తెలుగు వేదికపైకి తీసుకురావడానికి, ఇతర భాషలకు చెందిన సృజనాత్మక ప్రతిభను ప్రోత్సహించడానికి ప్రత్యేక చొరవ తీసుకుంటాం” అని ఆటా పేర్కొంది.
ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం (పబ్లిక్ గార్డెన్స్, నాంపల్లి, హైదరాబాద్)లో ఈ కార్యక్రమం జరగనుంది.
ఈ సదస్సు సాహిత్య ప్రియులందరికీ ఒక అరుదైన అవకాశం. భారతీయ సాహిత్యాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించే ఈ చారిత్రక కార్యక్రమానికి హాజరై, మహనీయుల ఆలోచనలను, అనుభూతిని పొందాల్సిందిగా ఆటా ఆహ్వానిస్తోంది.
ముఖ్య గమనిక: ATA తన 19వ ATA కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్ ను జులై 31 నుండి ఆగస్టు 2, 2026 వరకు బాల్టిమోర్, అమెరికాలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.






