ఏపీ విద్యార్థి జాహ్నవి కందుల మృతిపై అపహాస్యం… అమెరికా పోలీస్ అధికారికి ఉద్వాసన
అమెరికాలో గతేడాది సియాటిల్ పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతి చెందిన తెలుగమ్మాయి కందుల జాహ్నవి (23) గురించి చులకనగా మాట్లాడిన పోలీస్ అధికారి డేనియల్ ఆడెరర్ను ఉన్నతాధికారులు ఉద్యోగం నుంచి తొలగించారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి ఉన్నతవిద్య కోసం అమెరికా వెళ్లారు. 2023 జనవరి 23న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు గురించి పోలీసు అధికారి డేనియల్ చులకనగా మాట్లాడుతూ గట్టిగా నవ్విన వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది. ఆమె ఓ సాధారణ వ్యక్తి. ఈ మరణానికి అంత విలువలేదు. 11,000 డాలర్లకు చెక్కు రాస్తే సరిపోతుంది అన్నట్లుగా డేనియల్ మాట్లాడటం తీవ్ర దుమారం రేపింది. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం సైతం డిమాండ్ చేయడంతో అతణ్ని తక్షణం సస్పెండ్ చేశారు. ఉద్యోగం నుంచి తొలగిస్తూ తాజాగా తుది చర్యలు తీసుకున్నారు.













