భర్తతో కలిసి విహార యాత్రకు ఇవాంకా ట్రంప్
ఒకవైపు అమెరికాలో కరోనా కరాళనృత్యం చేస్తుంటే తిరిగి యథావిధిగా కార్యకలాపాలు ప్రారంభించాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతుండగా, తాజాగా ఆయన కూతురు, సలహాదారు ఇవాంకా ట్రంప్ భర్తతో కలిసి విహార యాత్రకు వెళ్లిన వార్తలు బయటకు రావడంతో ట్రంప్ కుటుంబంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలందరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేసిన ఇవాంక తానే వాటిని ఉల్లంఘించారంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మహమ్మారిని తేలికగా తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు.
ఇవాంక, తన భర్త జారేద్ కుష్నర్తో కలిసి జ్యూయిష్ హాలీడే కోసం న్యూజెర్సీకి వెళ్లారు. ఏప్రిల్ 8న ప్రారంభమైన పాసోవర్ సెలబ్రేషన్స్ కోసం వాషింగ్టన్లోని తన నివాసం వీడి గురువారం వరకు అక్కడే ఉన్నారు. ఈ విషయం వార్త పత్రికల్లో ప్రచురితమైన తర్వాత ఇవాంక బెడ్మినిస్టర్లోని ట్రంప్ కుటుంబానికి చెందిన గోల్ఫ్ రిసార్టుకు వెళ్లారని శ్వేతసౌధ వర్గాలు ధ్రువీకరించాయి.













