అమెరికాకే భారత విద్యార్థుల మొగ్గు…
అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతున్నది. నాణ్యమైన విద్య, ఎక్కువ జీతం కోసం భారతీయ విద్యార్థులు చలో అమెరికా అంటున్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న భారత విద్యార్థుల సంఖ్యలో 35 శాతం పెరుగుదల నమోదైంది. భారత్తో పోలిస్తే చదువులకు అయ్యే ఖర్చు కాస్త ఎక్కువైనా, అమెరికాలో మంచి ఉద్యోగం దొరికితే జీవితంలో చక్కగా స్థిరపడొచ్చని ఇండియన్ యూత్ భావిస్తున్నది. మరో ఆస్తికర పరిణామం ఏమంటే అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదివే భారత మధ్య తరగతి విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతున్నది. అసోసియేటెడ్ ప్రెస్ అంచనాల ప్రకారం ప్రస్తుతం అమెరికాలో 2.69 లక్షల మంది భారతీయులు ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. భారత్లో టైర్ 2, 3 నగరాల విద్యార్థులు కూడా అమెరికా చదువులపై ఆసక్తి చూపిస్తున్నారు. భారత విద్యార్థులు ట్యూషన్ ఫీజులు పూర్తిగా చెల్లిస్తుండటం వల్ల అమెరికా యూనివర్సిటీల ఆదాయం బాగానే పెరుగుతున్నది.







