అమెరికాలో తెలంగాణ యువతి దుర్మరణం
అమెరికాలో వెళ్లిన ఓ యువతి అక్కడే రోడ్డు ప్రమాదంలో అసువులు బాయడం తీవ్ర విషాదం నింపింది. తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టాణానికి చెందిన గుడ్ల కోటేశ్వర్రావు, బాలమణి దంపతుల కుమార్తె సౌమ్య(24), కుమారుడు సాయిచరణ్ ఉన్నారు. కోటేశ్వర్రావు సీఆర్పీఎఫ్ మాజీ జవాను. 20 ఏళ్ల క్రితం వీఆర్ఎస్ తీసుకున్నారు. యాదగిరిపల్లిలో తమ ఇంట్లోనే కిరాణా దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
అమెరికాలో ఫ్లోరిడాలోని అట్లాంటిక్ విశ్వవిద్యాలయంలో నాలుగు నెలల క్రితం ఎం.ఎస్. పూర్తి చేసిన సౌమ్య అక్కడే ఉద్యోగాన్వేషణలో ఉంది. ఆరు నెలల క్రితం యాదగిరిగుట్టకు వచ్చి నెల రోజులపాటు ఉండి తిరిగివెళ్లింది. ఆదివారం రాత్రి సరుకులు కొనడానికి ఓ దుకాణానికి వెళ్లి తిరిగి వస్తుండగా సౌమ్యను వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొనడంతో మృతి చెందిందని ఆమె రూమ్మేట్ తమకు సమాచారం అందించినట్లు కోటేశ్వర్రావు తెలిపారు. మృతదేహాన్ని సొంతంగా తెచ్చుకొనే స్తోమత కూడా తమకు లేదని, స్వదేశానికి రప్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందించాలని ఆయన కోరుతున్నారు.







