అమెరికాలో భారతీయుల ర్యాలీలు
లాటరీ పద్ధతిలో ఒక్కో దేశానికి పరిమితంగా గ్రీన్ కార్డులు జారీ చేయాలన్న అమెరికా నిర్ణయంతో లక్షలాది మంది భారతీయులు అభద్రతా భావనకు లోనయ్యారు. గ్రీన్ కార్డుల జారీకి అడ్డంకిగా మారిన నిబంధనలను మార్చి వాటి మంజూరుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ అమెరికాలోని పలు నగరాల్లో వందల సంఖ్యలో భారతీయులు శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించారు. హెచ్1 బి వీసాపై అమెరికా వెళ్లిన భారతీయ నిపుణులకు గ్రీన్ కార్డు నిబంధనలు ఆశనిపాతంలా మారాయి. ఇదే నిబంధనలు కొనసాగితే ఇప్పటికే వున్న జాబితాకు కార్డుల జారీకి సుమారుగా 70 ఏళ్లు పడుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సియాటెల్ కేంద్రంగా జీసిరిఫార్మ్స్ పేరిట ఓ సంస్థ ఏర్పాటయ్యింది. జీసీరిఫార్మ్స్ పిలుపు మేరకు అర్కన్సాస్, కెంటకి, ఒరిగాప్, ప్రాంక్ఫోర్ట్ తదితర ప్రాంతాలలో భారతీయులు శాంతి ర్యాలీలు నిర్వహించారు. భారతీయుల శాంతియుత ప్రదర్శనలకు, రౌండ్ టేబుల్ చర్చలకు అమెరికన్లు, ప్రజాప్రతినిధులు మద్దతుగా నిలిచారు. హిల్స్‌బరో, ఒరిగావ్లలో జరిగిన బ్రేక్ ది బాక్లాగ్ ప్రదర్శనలలో భారతీయ సమాజానికి చెందిన నాయకులు జైసన్ మోదీ, డబ్ల్యూ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.













