Kash patel: ఎఫ్‌బీఐ డైరెక్టర్ గా కాష్ పటేల్..
అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన కాష్ పటేల్ బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం వైట్ హౌస్ లో జరిగిన కార్యక్రమంలో అటార్నీ జనరల్ పామ్ బోండీ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. భారత మూలాలు ఉన్న కాష్ (Kash Patel) భగవద్గీతపై ప్రమాణం చేశారు.
ఈ కార్యక్రమానికి కాష్ పటేల్ గర్ల్‌ఫ్రెండ్ అలెక్సీస్ విల్కిన్స్, ఇతర కుటుంబసభ్యులు హాజరయ్యారు. విల్కిన్స్ భగవద్గీత(Bhagavad Gita)ను పట్టుకోగా.. దానిపై చేయి ఉంచి ఆయన ప్రమాణస్వీకారం పూర్తిచేశారు. అనంతరం కాష్ మాట్లాడుతూ.. ఇకపై ఎఫ్‌బీఐ లోపల, వెలుపల జవాబుదారీతనం ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు, బాధ్యతలు చేపట్టగానే ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. సంస్థ ప్రధాన కార్యాలయంలో 1000 మంది ఉద్యోగులను దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు ఫీల్డ్ ఆఫీసులకు బదిలీ చేయనున్నట్లు తెలిపారు. మరో 500 మందిని హంట్స్‌విల్లే, అలబామాలోని బ్యూరోకు పంపించనున్నట్లు పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్.. తన పాలకవర్గంలో పలువురు భారత సంతతి వ్యక్తులకు చోటు కల్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అధ్యక్షుడి వీర విధేయుడిగా పేరొందిన కాష్ పటేల్‌ను ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నామినేట్ చేశారు. దీన్ని గత గురువారం సెనెట్ 51-49 ఓట్లతో ఆమోదించింది. దీంతో ఆయన బ్యూరో 9వ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
కుటుంబ మూలాలు:
కాష్ పటేల్ కుటుంబమూలాలు గుజరాత్లో ఉన్నాయి. అతడి తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. ఉగాండాలో నియంత ఈదీ ఆమిన్ బెదిరింపుల వల్ల అమెరికాకు వలస వచ్చారు. న్యూయార్క్‌లోని గార్డెన్ సిటీ 1980లో కాష్ జన్మించారు. యూనివర్శిటీ ఆఫ్ రిచ్మాండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశారు. మియామీ కోర్టులో పబ్లిక్ డిఫెండర్‌గా పనిచేశారు. ఆ తర్వాత జస్టిస్ డిపార్ట్మెంట్లో చేశారు. అనంతరం ఆయన్ను ప్రతినిధుల సభలోని కమిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్ కోసం పనిచేసేందుకు నియమించారు. దీంతో ఆయన 2016 ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తులో సాయం చేశారు. అప్పుడే ట్రంప్ దృష్టిలో పడ్డారు కాష్ పటేల్.













