అమెరికాలో భారత సంతతి యువతి మృతి
అమెరికాలోని టెక్సాస్‌లో ఇటీవల అదృశ్యమైన లహరి పతివాడ(25) అనే ఇండో అమెరికన్ యువతి ఓక్ల హామాలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు. టెక్సాస్‌కు 322 కిలోమీటర్ల దూరంలోని ఓక్లహామాలో ఆమె మృతదేహం లభ్యమైంది. లహరి అదృశ్యమైన వార్త సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో ఓక్లహామాలో మృతదేహం ఉన్న విషయం వెలుగు లోకి వచ్చింది. టెక్సాస్‌లోని మెక్కిన్నే ప్రాంతానికి చెందిన లహరి ఓవర్‌ల్యాండ్ రీజనల్ మెడికల్ సెంటర్లో పనిచేస్తున్నారు. ఈ నెల 12న విధులు ముగిశాక ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. చివరిసారిగా డాలస్ శివారులో నల్ల టయోటా కారును నడుపుతూ ఆమె కనిపించారని స్థానికులు తెలిపారు. ఈమె కెన్సస్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రురాలయ్యారు. లహరి ఎలా మృతి చెందారన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.













