అమెరికాలో భారతీయ యువతికి ఘన సత్కారం
అమెరికా సమాజంలో మార్పునకు, ప్రగతికీ చోదక శక్తులుగా గుర్తింపు పొందిన 15 మంది బాలికలు, యువతుల్లో భారత సంతతి అమెరికన్ గీతాంజలీ రావు ఉన్నారు. అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో దేశాధ్యక్షుడి సతీమణి జిల్ బైడెన్ వీరిని సత్కరించారు. కొలరాడో రాష్ట్రానికి చెందిన గీతాంజలి రావు సీసంవల్ల ఏర్పడే కాలుష్యాన్ని కనిపెట్టే పరికరాన్ని ఆవిష్కరించి ఈ అవార్డు పొందారు. డిస్కవరీ ఎడ్యుకేషన్-3ఎం సంస్థ నుంచి అగ్ర యువ శాస్త్రవేత్త అవార్డు ఆమెకు లభించింది. సైన్స్, ఇంజినీరింగ్, సాంకేతిక, గణిత శాస్త్రాల్లో (స్టెమ్) బోధన కోసం గీతాంజలి రూపొందించిన 5 అంచెల ప్రక్రియను 80,000 మంది పాఠశాల విద్యార్థులకు బోధిస్తున్నారు. ఆమె 2020లో టైమ్ మ్యాగజీన్ మొట్టమొదటిసారి ప్రకటించిన కిడ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నారు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) విద్యార్థి అయిన గీతాంజలి ఫోర్ట్స్ పత్రిక ప్రకటించిన 30 అండర్ 30 విజేతల్లోనూ స్థానం సంపాదించారు.













