భారత్ తో వాణిజ్య విభేదాలకు స్వస్తి పలకాలి
అమెరికా, భారతదేశం మధ్య వాణిజ్య విభేదాలను ముగింపునకు ఒప్పందం కుదుర్చుకోవడంలో ఆలస్యంపై అమెరికా వ్యాపార ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విభేదాలకు స్వస్తి పలికి సహృద్భావ పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య వాణిజ్యం కొనసాగాలని వారు ఆశిస్తున్నారు. భారత్‌కు జీఎస్పీ హోదా తొలగించడం తమ ఉత్పత్తుల వాణిజ్యానికే ప్రతిబంధంగా మారిందని ఆ దేశ ప్రతినిధులు అంటున్నారు. ముఖ్యంగా పెకాన్ ఎండు ఫలాలకు భారత్ అతిపెద్ద మార్కెట్ అని చెబుతూ తమ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ప్రధానంగా అమెరికా ఎగుమతి చేస్తున్న వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న సుంకం తమ దేశ గ్రామీణ ఉత్పత్తిదారులకు ప్రతికూలంగా మారిందని 34 మంది ప్రతినిధులు ఆ దేశ వాణిజ్య శాఖ ప్రతినిధి రాబర్ట్ లైట్ హైజర్‌కు లేఖ రాశారు.
అమెరికా ఎగుమతి చేస్తున్న పెకాన్ ఎండు ఫలాలపై భారత్ విధిస్తున్న సుంకం మరీ ఎక్కువగా ఉందని వారు తమ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని వ్యవసాయోత్పత్తుల ఎగుమతులపై భారత్ విధిస్తున్న సుంకాలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని వారు రాబర్ట్‌ను కోరారు. గత నెలలో కూడా రెండు ప్రధాన పార్టీలకు చెందిన ప్రతినిధులు ఇదే రీతితో శ్వేత సౌధం వర్గాలకు లేఖ అందజేశారు. జూన్‌లో అమెరికా ప్రాధాన్య వాణిజ్య వోదా (జీఎస్పీ) జాబితా నుండి భారత్‌ను తొలగించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య పరస్పర ఎగుమతులపై సుంకాలను పెంపు కొనసాగుతోంది.













