Hindu Dharmam: అమెరికాలో హిందూధర్మం టీవీ
 
                                    అమెరికా(America)లో ఎక్కువగా మాట్లాడే భారతీయ భాషల జాబితాలో తెలుగు ముందువరుసలోనే ఉంది. హిందీ, గుజరాతీ తరువాత తెలుగు భాషనే ఎక్కువమంది మాట్లాడుతున్నారని చెబుతారు. ఇటీవలిలకాలంలో ఉన్నత విద్య, ఉపాధి కోసం ఇతర దేశాల నుంచి అమెరికాకు చేరుకుంటున్నవారిలో తెలుగువారి జనాభా గణనీయంగా పెరిగిన నేపథ్యంలో అమెరికాలోని తెలుగువారికి వార్తలు ఇచ్చేందుకు పలు టీవీ ఛానల్స్ యుఎస్‌లో తమ ఫ్రాంచైజీలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో టీవీ 5 ఛానల్ కు మంచి ఆదరణ ఉంది. వార్తలు, వ్యాపార విశేషాలను ఎప్పటికప్పుడు తమ ఛానల్ ద్వారా ఆధ్మాత్మిక ప్రసారాలకోసం టీవీ 5 సంస్థ హిందూ ధర్మం(Hindu Dharmam) పేరుతో ఓ ఆధ్యాత్మిక ఛానల్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఛానల్ ద్వారా భక్తికి సంబంధించిన అనేక విషయాలను ఛానల్ ద్వారా ప్రసారం చేస్తోంది. ప్రవచనాలు, ఆలయాల్లో జరిగే విశేషాలు, ఇతర అంశాలపై పండితుల ద్వారా వివరిస్తోంది. ఇప్పుడు అమెరికాలో పెద్ద సంఖ్యలో ఉన్న తెలుగువారికోసం ముఖ్యంగా ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి ఉన్నవారికోసం హిందూధర్మం ఛానల్ ను అమెరికా అంతటా విస్తరించేలా చర్యలు చేపట్టింది.
అమెరికాలోని ఇన్నోగ్లోబల్ సంస్థతో కలిసి హిందూ ధర్మం ఛానల్ ద్వారా అమెరికాలోని తెలుగు కమ్యూనిటీకి ఆధ్యాత్మిక కార్యక్రమాలను అమెరికాలోని దేవాలయాల్లో జరుగుతున్న సేవలను ప్రత్యక్షంగా అందించనున్నది. ఇందుకోసం టీవీ 5 న్యూస్ ఛానల్ ఆ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. టీవీ 5 ఛానల్ అధినేత, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్ నాయుడు సారధ్యంలో, అమెరికాలో కమ్యూనిటీ నాయకులైన ప్రసాద్ గారపాటి, జగదీశ్ ప్రభల ఆధ్వర్యంలో ఈ హిందూధర్మం ఛానల్ ప్రసారాలను ఇప్పుడు అమెరికా అంతటా విస్తృతం చేయనున్నారు.
తెలుగువారి పెద్దపండుగ సంక్రాంతి రోజున ఈ భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టారు. 24/7 ఛానెల్ అయిన హిందూధర్మం టీవీలో ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షించవచ్చు. వాషింగ్టన్ డీసీలో ప్రధాన కార్యాలయం ఉన్న ఇన్నోగ్లోబల్ సంస్థ ఇప్పుడు ఈ హిందూ ధర్మం ఛానల్ ప్రసారాలను, కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. మార్చి 22న కొలంబస్ ఒహాయోలో ప్రారంభ కార్యక్రమం నిర్వహించనున్నారు.











