He Govind: అట్లాంటాలో ఘనంగా ‘హే గోవింద్’ సంగీత విభావరి
అమెరికాలోని అట్లాంటా నగరంలో ‘ఎయిమ్ ఫర్ సేవ’ (AIM for Seva) ఆధ్వర్యంలో ‘హే గోవింద్’ (He Govind) పేరుతో నిర్వహించిన సంగీత విభావరి అట్టహాసంగా జరిగింది. గ్రామీణ భారతంలో విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో దాతలను గౌరవించేందుకు (Donor Appreciation Event) ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సంగీతం, సంస్కృతి, సేవా దృక్పథం కలగలిసిన ఈ వేడుకలో ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు జయతీర్థ్ మేవుండి (Jayateerth Mevundi) తన గానంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఆయనతో పాటు ప్రవీణ్ గోడిండి (ఫ్లూట్), నరేంద్ర ఎల్. నాయక్ (హార్మోనియం), రాజేంద్ర నాకోడ్ (తబలా) వంటి దిగ్గజ వాయిద్యకారులు కలిసి కృష్ణునిపై సంకీర్తనలతో (He Govind) భక్తి భావాన్ని పండించారు.
పూజ్య స్వామి దయానంద సరస్వతి స్థాపించిన ‘ఎయిమ్ ఫర్ సేవ’ (AIM for Seva) సంస్థ.. భారతదేశంలోని 17 రాష్ట్రాల్లో 101 ఉచిత విద్యార్థి గృహాల (ఛాత్రాలయాలు) ద్వారా ఏటా 9000 మందికి పైగా గ్రామీణ పేద విద్యార్థులకు వసతి, విద్యను అందిస్తోంది. ఈ ఏడాది అట్లాంటా చాప్టర్ ద్వారా 500 మంది పిల్లలను దత్తత తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా, దాతల సహకారంతో ఇప్పటికే 300 మందికి పైగా పిల్లల బాధ్యతను స్వీకరించేలా 1.50 లక్షల డాలర్ల విరాళాలు సేకరించినట్లు నిర్వాహకులు ఈశ్వర్ మనీ తెలిపారు.
ఈ సందర్భంగా సమాజ సేవకుడు ధీరేంద్ర షా, రక్షా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అపర్ణ భట్టాచార్యలను ఘనంగా సత్కరించారు. గురు ప్రశాంత్ కృష్ణమూర్తి శిష్యులైన చిన్నారుల ప్రార్థనా గీతాలతో మొదలైన ఈ కార్యక్రమం అట్లాంటాలో జరిగిన అత్యుత్తమ (He Govind) ప్రదర్శనలలో ఒకటిగా నిలిచిందని నిర్వాహకులు పేర్కొన్నారు.






