ఆసక్తికరంగా సాగిన టాంటెక్స్ సాహిత్య సదస్సు

టాంటెక్స్ తెలుగు సాహిత్య 14వ వార్షికోత్సవ సదస్సు జూలై 18వ తేదీన చాలా ఆసక్తికరంగా సాగింది. నెలా నెలా తెలుగు వెన్నెల శీర్షిక పేరుతో ప్రతి మాసం జరుగుతూ వస్తున్న సాహిత్య సదస్సులలో ఇది 168వ భాగం. సాహిత్యంతో పాటు సంగీత నృత్య వినోద ప్రదర్శనలతో వార్షికోత్సవ కార్యక్రమం నిండుగా సాగింది.
చిన్నారి మాడ సమన్వితల ప్రార్థనా గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. వార్షికోత్సవ సందర్భంగా సంస్థ అధ్యక్షులు లక్ష్మి అన్నపూర్ణ పాలేటి గారు సంస్థ పూర్వ నిర్వహకులను, వ్యవస్థాపకులను గుర్తు చేస్తూ సాహిత్య సదస్సుల సుదీర్ఘ ప్రస్థానానికి వారందించిన సేవలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక సభ్యులతో ఒకరైన తోటకూర ప్రసాద్, వంగూరి చిట్టెన్ రాజు నాటి ప్రారంభ దశ విశేషాలను ఆత్మీయంగా గుర్తు తెచ్చారు. సాహిత్య కార్యక్రమాలలో భాగంగా విశిష్ట అతిథులు డాక్టర్ ఉపద్రష్ట సత్యం రసరంజిత సంవాద సాహిత్యం అనే అంశంపై చక్కటి చర్చ చేశారు. విశిష్ట అతిథి డాక్టర్ శొంఠి శారద గానాభిజ్ఞత సంగీత స్వరూపం అన్న లోతైన అంశం, తాత్విక దృష్టికోణంలో విశ్లేషించిన వారి ప్రసంగం విద్వన్మణుల ప్రసంశలనందుకున్నాయి.
పద్యకవి, గాయకులు, కథారచయిత ఫణి డొక్కా సాహితీ లోకంలో హాస్య గుళికలు అన్న అంశంపై ప్రసంగించి సభలో నవ్వులు పూయించారు. ముఖ్య అతిథి, భావ, గజల్ కవితల రచయిత్రి, సంగీతజ్ఞులు డాక్టర్ అరవిందారావు వెన్నెలతో ఒక మాట అన్న శీర్షికన చక్కటి విందైన సంగీత లహరిని ప్రసరింపజేశారు. మరొక ముఖ్య అతిథి, వేణుగాన కళాకారులు డాక్టర్ మంద అనంతకృష్ణ ప్రదర్శన కూడా సభా కార్యక్రమాలలో భాగంగా సాగింది.
సంగీత కార్యక్రమాలలో భాగంగా చిన్నారులు సాహితి వేముల, సిందూర వేముల అందెశ్రీ గారి రచన మాయమై పోతున్న డమ్మా మనిషన్నవాడు చిన్నారి మేఘనకు కుప్పచ్చి త్యాగరాయ కీర్తన శోభిల్లు సప్తస్వర ఆలిపించి రంజింపజేశారు. నృత్య ప్రదర్శనలలో భాగంగా వివిధ నృత్య పాఠశాలల విద్యార్థినులు, చిన్నారులు చక్కటి నాట్యాంశాలతో సభాకులను విశేషంగా ఆకట్టుకున్నారు. సభలో ప్రసంగాలపై ప్రత్యేకించి విశిష్ట ముఖ్య అతిథుల ప్రసంగంపై పెద్దలు తమ సహృదయ స్పందనను తెలిజేశారు. ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు శ్రీమతి లక్ష్మి అన్నపూర్ణ పాలేటి, నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు సమన్వయకర్త శ్రీమతి నీరజా కుప్పచ్చి తదితర స్థానిక సాహిత్య ప్రియులు హాజరయ్యారు. సమన్వయకర్త విశిష్ట అతిథులకు జ్ఞాపికలు చదవి వినిపించారు.
సంఘం అధ్యక్షులు శ్రీమతి లక్ష్మి అన్నపూర్ణ పాలేటి విశేష ప్రతిభ కనబరిచిన శృతిలయ, రాగాలీన, నాట్యాంజలి మరియు సాయి నిత్య నృత్య పాఠశాలల విద్యార్థినులకు వారి గురువులకూ ధన్యవాదాలు తెలిపారు. చక్కటి మృదు మధురంగా గీతాలు పాడిన సమన్విత, మేఘనతో పాటు, సాహిత్య అభిమానులకు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గం, పాలక మండలి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.











































































