లాస్ ఏంజల్స్ లో లాటా మినీ ఒలింపిక్స్ విజయవంతం
అమెరికాలోని లాస్ ఏంజల్స్ మహా నగరంలో లాస్ ఏంజల్స్ తెలుగు అసోసియేషన్ (లాటా) నిర్వహించిన మినీ ఒలింపిక్స్ విజయవంతమయ్యాయి. ఎనిమిది క్రీడా పోటీలకు ఆరు చోట్ల లీగ్ మ్యాచులు, ప్రతీ ఆటకూ ఫైనల్స్ తో కలిపి 6 వారాల పాటు ఈ పోటీలను నిర్వహించారు. పిల్లల నుంచి పెద్దల వరకూ దాదాపు 1100 మంది క్రీడాకారులు ఈ మినీ ఒలింపిక్స్ లో పాల్గొన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఇటువంటి క్రీడా పోటీలు ఒక ఎన్ఆర్ఐ తెలుగు సంస్థ నిర్వహించటం ఇదే మొదటి సారి.
మే 26న మొదలైన ఈ క్రీడా పోటీలు జూలై 1న క్రికెట్ ఫైనల్స్ తో ముగిసాయి. క్రికెట్, వాలీబాల్, టెన్నిస్, టెన్నికోయిట్, చెస్, క్యారమ్, స్విమ్మింగ్, రన్నింగ్ క్రీడలను ఇర్వైన్, ఈస్ట్ వెల్, వాలెన్సియా, టోరెంస్, సైష్రస్, బర్ బ్యాంకు, బ్యుయనా పార్క్, ఆర్కేడై నగరాల్లో నిర్వహించడం జరిగింది. 145 మంది కార్యకర్తలు ఈ పోటీలను పర్యవేక్షించారు.
వివిధ వయస్సుల వారికి ఆయా విభాగాల్లోని పోటీలు నిర్వహించటం జరిగింది. ప్రతి ఏటా వాలీబాల్, చెస్, క్యారమ్ క్రీడలు నిర్వహిస్తున్నా, ఈ ఏడాది తొలిసారి నిర్వహించిన టెన్నిస్, టెన్నికోయిట్, స్విమ్మింగ్, క్రికెట్, రన్నింగ్ లో పాల్గొనేందుకు క్రీడాకారులు అమితాసక్తి కనబరిచారు. క్రికెట్లో అత్యధికం గా 275 మంది, వాలీబాల్ 200 మంది, టెన్నిస్, క్యారమ్, టెన్నికోయిట్ లలో చెరొక 150 మంది పాల్గొన్నారు. వాలెన్సియా నుంచి శాం డియెగో వరకు, కల్వర్ సిటీ నుంచి రివర్ సైడ్ వరకు క్రీడాకారులు మినీ ఒలింపిక్స్ లో ఎంతో ఔత్సాహంగా పాల్గొన్నారు.
10 సంవత్సరాల తర్వాత (2028) లాస్ ఏంజెల్స్ మహా నగరంలోనే ఒలింపిక్స్ జరుగుతుండటం విశేషం. నేటి బాలలే రేపటి విజేతలు అనే సంకల్పంతో లాటా మినీ ఒలింపిక్స్ కు మరింత విశిష్టత చేకూరింది. లాటా మినీ ఒలింపిక్స్ ని ప్రతీ ఏటా ఇలానే జరపాలని పిల్లలు, తల్తిదండ్రులు లాటా ని కోరడం విశేషం. మినీ ఒలింపిక్స్ ని ఔరా అనిపించే విధంగా విజయవంతం చేసిన ప్రతీ కార్యకర్తకూ, ప్రతీ క్రీడాకారునికి, దాతలకు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు బోర్డు అఫ్ డైరెక్టర్స్ కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలో అందరిని అలరించే విధంగా మినీ ఒలింపిక్స్ విజయోత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.













