విదేశాల్లోని భారతీయులను తీసుకొస్తాం : కేంద్రం
వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను ఈ నెల ఏడో తేదీ నుంచి దశలవారీగా స్వదేశానికి తీసుకురానున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. విమానాలు, నౌకాదళ ఓడల్లో వీరిని తరలించనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రమాణిక నిర్వహణ విధానం (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్-ఎస్వోపీ) సిద్ధం చేసినట్లు తెలిపింది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో నిలిచిపోయిన భారతీయ ప్రయాణికుల వివరాలను ఆయా దేశాల్లోని రాయబార కార్యాలయాలు సిద్ధం చేస్తున్నట్లు హోంశాఖ వెల్లడించింది. ఎవరి ఖర్చులు వారే భరించుకోవాల్సి ఉంటుందని సృష్టం చేసింది. భారతీయులు స్వదేశంలో అడుగుపెట్టిన తర్వాత వారికి అవసరమైన పరీక్షలు, క్వారంటైన్ సౌకర్యాలు రాష్ట్రాలే ఏర్పాటు చేయాలని, ఇందుకు సంబంధించిన ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని పేర్కొంది.













