లాబీయింగ్ లో గూగుల్ అగ్రస్థానం
ప్రభుత్వ విధానాలు తమకు అనుకూలంగా ఉండేలా విధాన నిర్ణేతలను ప్రభావితం చేసే క్రమంలో లాబీయింగ్ అమెరికన్ టెక్నాలజీ దిగ్గజాలు గణనీయంగా ఖర్చు చేస్తున్నాయి. టెక్ దిగ్గజం గూగుల్ ఇందుకు సంబంధించి గతేడాది ఏకంగా 21.7 మిలియన్ డాలర్లు వెచ్చించి అగ్రస్థానంలో నిలిచింది. 2009లో ఇలాంటి లాబీయింగ్పై గూగుల్ 4 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. గతేడాది వచ్చే సరికి ఇది ఏకంగా అయిదు రెట్లు పెరిగింది. ఇటీవల కాలంలో లాబీయింగ్ వ్యయాలు గత దశాబ్ద కాలంతో పోలిస్తే అత్యధిక స్థాయిలో ఉంటున్నాయని మీడియా సంస్థ సీఎన్బీసీ ఒక నివేదికలో పేర్కొంది.
సెంటర్ ఫర్ రెస్పాన్సివ్ పాలిటిక్స్ అనే లాభాపేక్ష రహిత ఎన్జీవో గణాంకాల ఆధారంగా దీన్ని రూపొందించింది. లాబీయింగ్పై అత్యధికంగా ఖర్చు చేస్తున్న సంస్థల జాబితాలో గూగుల్ వరుసగా రెండో ఏడాదీ అగ్రస్థానంలో ఉంది. బోయింగ్, ఏటీఅండ్టీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు అమెజాన్, ఫేస్బుక్ కూడా 2018లో లాబీయింగ్పై రికార్డు స్థాయిలో ఖర్చు చేశాయి. యాపిల్ ఇందుకు గతేడాది 6.68 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.













