గివింగ్ తామా: ప్రాచీన కళల సేవ – వివిధ సంస్థలకు తోడ్పాటు, వందలాది కళాకారులకు చేయూత
తెలుగు రాష్ట్రాలలోని ఎన్నో అపురూపమైన, అరుదైన కళా రూపాలు తరతరాలుగా విరాజిల్లుతున్నాయి. ఇవన్నీ 1990ల వరకు అప్రతిహతంగా సాగినప్పటికీ, క్రమేణా ఆదరణ తగ్గుతూ వస్తోంది. 1981లో స్థాపించిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (తామా), గత 42 సంవత్సరాలుగా మన కళలను, సంస్కృతిని, సాంప్రదాయాలను, భాషను, సాహిత్యాన్ని వెన్ను దున్నుగా ప్రోత్సహిస్తూ వస్తోంది. వీరు పాండెమిక్ సమయంలో భారత దేశం నుండి అంతర్జాలంలో ఎన్నో కళా ప్రదర్శనలు చేయించి, కళాకారులను, సంస్థలను ఆదరించారు. దాదాపు అన్ని కార్యక్రమాలు ‘ఇన్ పర్సన్’ జరుగుతున్న ఈ సమయంలో ఆన్ లైన్ లో చేయాలనుకోవడం కొంత సాహసమే.
అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ మరియు హాలిడే సీజన్లో ధైర్యం చేసి, తామా గివింగ్ – థర్స్ డే సిరీస్ లో భాగంగా డిసెంబర్ 7, 14, 21 న తామా ఫేస్ బుక్ ద్వారా నాలుగు సంస్థలు పలు రకాల ప్రాచీన కళలను ప్రదర్శించారు. శ్రీ. టి ఆర్ రెడ్డి గారు సహృదయంతో సమర్పించిన ఈ కార్యక్రమాల వల్ల 100 మందికి పైగా కళాకారుల కుటుంబాలకు లబ్ధి చేకూరింది. అలానే, జాతీయ సంస్థలు తానా, నాటా, ఆటా, టి టి ఏ, సీనియర్ల సంఘం మైత్రి సహకారంతో ఈ ప్రదర్శనలు జరిగాయి. కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురైనప్పటికీ, తామా నాయకత్వం ధృడ సంకల్పంతో, సేవా తత్పరత తో ముందుకు సాగడం గమనార్హం. వీటితో 2023 కార్యక్రమాలు ముగిశాయి.
ముందు సంవత్సరాల నాయకుల అడుగుజాడల్లో నడుస్తూ, 36 కార్యక్రమాలు ఒకే సంవత్సరంలో, అది కూడా అన్ని వయసుల వారికి ఉపయోగపడేవి చెయ్యడం, మరింత మందికి చేరువవ్వడం, అందులోనూ చాలా కార్యక్రమాలు బ్లాక్ బస్టర్స్ కావడం తామా కే సాధ్యం. యువతకు, ఆరోగ్యానికి, సమాజ హితానికి సరికొత్తగా చేసిన 12 కార్యక్రమాలకు కూడా విశేష స్పందన లభించడం ప్రశంసనీయం. మరిన్ని వివరాలకు www.tama.org ని సందర్శించండి లేదా info@tama.org కి ఇమెయిల్ చేయండి. సంవత్సరం పొడవునా ఎంతో కృషి, సహాయ సహకారాలు అందించిన 4 మూల స్థంభాలు ప్రజలు, స్పాన్సర్లు, వాలంటీర్లు, తామా టీం లకు అధ్యక్షులు సాయిరామ్ కారుమంచి ధన్యవాదాలు తెలియజేసి, 2024లో కూడా ఇదే రీతిలో పాల్గొనాలని మనవి చేశారు.
డిసెంబర్ 7 న సురభి డ్రామా థియేటర్ – జయానంద్ గ్రూప్, హైదరాబాద్ వారు జై పాతాళ భైరవి నాటకం ప్రదర్శించారు. కథానాయికను ఆకాశంలో పెద్ద పెట్టెలో తీసుకువెళ్లడం, మొసలితో యుద్ధం, ఉరుములు, మెరుపులు మొదలగు స్పెషల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకున్నాయి. డిసెంబర్ 14 న శ్రీ శారద విజయ నాట్య మండలి, నల్గొండ వారి శ్రీ కృష్ణ సత్య పద్య నాటకం ఎంతగానో అలరించింది. తులాభారం సెట్టింగులు, అలవోకగా పద్యాలు పాడటం, అందరూ మహిళా కళాకారిణులే కావడం ప్రత్యేకత. శ్రీ విఘ్నేశ్వర కళాబృందం, తాడేపల్లిగూడెం వారు డిసెంబర్ 14న చేసిన అల్లూరి సీతారామరాజు బుర్ర కథ, తుపాకీ రాముడు, పిట్టల దొర కళా రూపాలు మన కళల గొప్పతనాన్ని చాటి చెప్పాయి. అలానే, అదే రోజు శ్రీదేవి కళాసమితి, పశ్చిమ గోదావరి వారు చేసిన పార్వతీ కళ్యాణం హరి కథ మరియు మహిళల జానపద నృత్యాలు విశిష్టంగా సాగాయి. కళలు కనుమరుగు అవుతున్నప్పుడు, తామా వారు గుర్తుపెట్టుకుని మరీ అవకాశం ఇవ్వడం తమకు ఎంతో స్ఫూర్తి నిచ్చిందనీ, ఆన్ లైన్ లో అవకాశాలు లేక పోయినప్పటికీ వీరు ప్రత్యేకంగా చేయించి గొప్ప మనసు చాటుకున్నారని చెప్తూ, తామా తో పాటు సహకరించిన పలు సంస్థలకు కృతజ్ఞతలు తెలియజేసి, ఇలానే అందరి ఆదరణ కావాలని కళాకారుల బృందాలు విజ్ఞప్తి చేశాయి.
సాయిరామ్ కారుమంచి వివిధ సందర్భాలలో మాట్లాడుతూ, ఈ కళా రూపాలన్నీ అద్భుతాలనీ, ఇది నాంది మాత్రమే అనీ, ఇవి అజరామరంగా సాగాలంటే మనందరమూ పూనుకోవాలని, లేకుంటే అంతరించే అవకాశం ఉందనీ, భారత దేశంలో లేక బయట దేశాలలో ఉన్న మన వారందరూ తలా ఒక చెయ్యి వెయ్యాలని అభ్యర్ధించారు. తామా జట్టు నుంచి రుపేంద్ర వేములపల్లి, శ్రీనివాస్ రామిశెట్టి, సునీల్ దేవరపల్లి, శశి దగ్గుల, సత్య గుత్తుల, సుబ్బారావు మద్దాలి, మధు యార్లగడ్డ, శ్రీనివాస్ ఉప్పు, రాఘవ తడవర్తి సహకారం అందించారు. ఈ కళా ప్రదర్శనలన్నీ దిగ్విజయంగా సాగడానికి తోడ్పడిన స్పాన్సర్ శ్రీ. టి ఆర్ రెడ్డి గారికి, సహకరించిన సంస్థలకు, వాలంటీర్లకు, వీక్షకులకు, తామా టీంకు సాయిరామ్ కృతజ్ఞతాభినందనలు తెలిపి, ముగించారు.













