అమెరికాలో చాలా చోట్ల కర్ఫ్యూ….అల్లర్లకు దారి తీస్తున్న నల్లజాతీయుని మృతి
అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా అమెరికాలో రాజుకున్న నిరసన జ్వాలలు దాదాపు 11 రాష్ట్రాలను చుట్టుముట్టాయి. చివరకు వాషింగ్టన్ డీసిలోని అధ్యక్ష భవనాన్ని కూడా ఆందోళనకారులు చుట్టుముట్టారు. దీంతో అమెరికా నల్లజాతీయుల ఆందోళన ఇప్పుడు జాత్యంహకార ఆందోళనగా మారింది. మరోవైపు ఇదే అదునుగా చట్టవ్యతిరేకులు సూపర్మార్కెట్లను, ఇతర ఖరీదైన దుకాణాలను లూటి చేయడం ప్రారంభించారు. దీంతో అమెరికాలో ఆందోళన చివరకు ఎటువైపు పోతుందోనని అందరూ ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు కరోనా వైరస్ విజృంభణ సమయంలోనే ఆందోళనలు ఉవ్వెత్తున చెలరేగడంపై అందరూ ఆందోళన చెందుతున్నారు. పలు నగరాల్లో అమెరికా అధికారులు కర్ఫ్యూను విధించడం పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా తెలుస్తోంది.
అమెరికాలోనిపలు నగరాలు ఆందోళనలతో రగిలిపోతున్నాయి. పలుచోట్ల నిరసనకారులు దుకాణాలు లూటీ చేస్తున్నారు. అమెరికాలో అత్యధిక చోట్ల కర్ఫ్యూ ఉన్నప్పటికీ…లూటీలు ఆగడం లేదు. 1992 తర్వాత సైన్యం రంగంలోకి దిగిందంటే పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో తెలుస్తోంది. ఆందోళనలు, లూటీలతో సాధారణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. న్యూయార్క్, చికాగో, అట్లాంటా, లాస్ ఏంజెలెస్ వంటి చాలా నగరాల్లో కర్ఫ్యూ విధించినా నిరసనకారులు వీధుల్లోకి వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో కార్లు, దుకాణాలు భవనాలకు నిప్పుపెట్టారు. లాస్ ఏంజెలెస్ లో ప్రముఖ దుకాణాలు లూటీ కాగా, న్యూయార్క్ లో ఆందోళనకారులు దాదాపు 20 కార్లను దగ్ధం చేశారు. కాలిఫోర్నియా, చికాగో, అట్లాంటాలో హింసాత్మక నిరసనలను నియంత్రించటానికి కర్ఫ్యూ విధించినా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఘటన జరిగిన మినియాపోలిస్ లో పరిస్థితి కొద్దిగా సద్దుమణిగినా…దేశవ్యాప్తంగా వేలాది మంది నిరసనకారులను అరెస్ట్ చేశారు. నిరసనల ముసుగులో కొందరు ఆకతాయిలు పలు నగరాల్లో లూటీలకు పాల్పడ్డారు. రాళ్లు, పెట్రోల్ బాంబులతో పోలీసులపై దాడి చేసి ఓ పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టడంతో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి.
వైట్‌హౌస్ వద్ద
‘ఐ కాంట్ బ్రీత్’ అనే నినాదం అగ్రరాజ్య వీధుల్లో మారుమోగుతోంది. ఈ క్రమంలో వేలాదిమంది ఆందోళనకారులు ఆదివారం రాత్రి వైట్‌హౌస్ వద్దకు తరలివచ్చారు. ఆందోళనకారులు అధ్యక్ష భవనం సమీపంలో చెత్త కుప్పకు నిప్పుపెట్టారు. భారీగా ఉన్న బందోబస్తును చీల్చుకుంటూ అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆందోళనలు ఉద్రిక్తంగా మారడంలో ముందస్తు జాగ్రత్తగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సీక్రెట్ ఏజెన్సీ రహస్య బంకర్లోకి పంపింది. సుమారు గంటపాటు ట్రంప్ అదే బంకర్లో తలదాచుకున్నారు. అధ్యక్ష భవనం ముందు పరిస్థితి అదుపు తప్పడంలో నేషనల్ గార్డ్ బలగాలను రంగంలోకి దించారు. దీంతో ఆందోళకారులు, పోలీసులు మధ్య ఘర్షణ యుద్ధరంగాన్ని తలపించింది.
మరోవైపు్ర ప్ కూడా అల్లర్లపై ఉక్కుపాదంతో అణచివేస్తామని చెప్పడం ఆందోళనకారులను మరింత రెచ్చగొట్టినట్లయింది. అసలే లాక్‌డౌన్‌తో విసిగి, ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న నల్లజాతీయులు ఈ ఆందోళన కార్యక్రమంలో ఉధృతంగా పాల్గొంటున్నారు. దానికితోడు కొంతమంది లూటీలకు పాల్పడుతున్నారు. మొత్తానికి నేడు అమెరికా ఆందోళనలతో, అల్లర్లతో, కరోనా వైరస్‌తో అతలాకుతలమవుతోంది.













