అమెరికాలో ఉగ్రదాడికి కుట్ర
అమెరికాలో విద్వేష భావాలు పెరిగిపోయాయి. దేశాధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ముస్లింలు, సిక్కులపై దాడులు అధికమయ్యాయి. న్యూయార్క్ నగరంలో ముస్లింల జనాభా అధికంగా ఉన్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని పేలుళ్లకు కుట్ర పన్నిన నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, తుపాకులు, రైఫిల్స్, మారణాయుధాలు స్వాధీనం చేసుకొని నిందితుల కుట్రను భగ్నం చేశారు. ఎస్పీ పాట్రిక్ ఫెలాన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రోచెస్టర్ ప్రాంతానికి చెందిన బ్రియాన్ కొలానేరి (20), ఆండ్రీవ్ క్రీసెల్ (18), విన్సింట్ వెట్రోమైల్ (19)తో పాలు మరో 16 ఏండ్ల యువకుడు న్యూయార్క్‌లోని ముస్లింలు జనాభా అధికంగా ఉన్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని పేలుళ్లకు కుట్రపన్నారు. ఇస్లాం మతం పట్ల విద్వేష భావాల కారణంగానే తాము దాడులకు కుట్రపన్నినట్టు ప్రాథమిక విచారణలో నిందితులు అంగీకరించారని ఎస్పీ తెలిపారు.













