Atlanta: ఘనంగా ‘అట్లాంటా బ్యాడ్మింటన్ ఓపెన్’
‘అట్లాంటా బ్యాడ్మింటన్ ఓపెన్ 2025’ టోర్నమెంట్ ఇటీవల ఘనంగా జరిగింది. అట్లాంటా (Atlanta) లోని ఫోర్టియస్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నవంబర్ 14, 15, 16 తేదీల్లో ఈ పోటీలు జరిగాయి. ఈ భారీ క్రీడా ఉత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి వందలాది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఛాంపియన్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అన్ని వయసుల ఆటగాళ్లు దీనికి హాజరయ్యారు. అమెరికాలోనే అతిపెద్ద బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌గా ఇది చరిత్ర పుటల్లో నిలిచింది. ఫోర్టియస్ స్పోర్ట్స్ అకాడమీ అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టులకు ప్రసిద్ధి. బ్లూ మాట్స్ తో విశాలమైన 22 కోర్టులలో ఈ టోర్నమెంట్ సజావుగా సాగడంలో ఫోర్టియస్ స్పోర్ట్స్ అకాడమీ కీలక పాత్ర పోషించింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ప్రతి కోర్ట్‌లో టెక్నికల్ టీమ్స్, మ్యాచ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, ప్రేక్షకుల కోసం ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు, పిల్లల కోసం ప్రత్యేక విశ్రాంతి ప్రదేశాలు, అన్నీ పాల్గొన్నవారి ప్రశంసలను అందుకున్నాయి. ‘‘ఇంతలా ప్రొఫెషనల్ సెటప్ చాలా అరుదుగా చూస్తాం. ఫోర్టియస్ టీం చేసిన ప్లానింగ్, సమన్వయం అద్భుతం.’’ అంటూ పిల్లల తల్లిదండ్రులు, ప్లేయర్స్, కోచ్‌లు ప్రశంసించారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ యువ క్రీడాకారుల్లో స్ఫూర్తిని కలిగించారు. కఠోర శ్రమ, క్రమశిక్షణ, లక్ష్యసాధనపై తన అనుభవాలను పంచుకున్నారు. వందలాది అభిమానులు, ఆటగాళ్లతో ఫొటోలు దిగారు. పలువురు చిన్నారుల ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. పీవీ సింధు రాకతో ప్రాంగణంలోని వాతావరణం ఉత్సాహభరితంగా మారింది. ఫోర్టియస్ స్పోర్ట్స్ అకాడమీ సభ్యత్వం తీసుకున్న సింధు.. వచ్చే ఏడాది అట్లాంటా వచ్చినపుడు ఇక్కడి బ్యాడ్మింటన్ ప్లేయర్లకు శిక్షణ ఇస్తానని ప్రకటించారు.
ఫోర్టియస్ స్పోర్ట్స్ అకాడమీ మేనేజ్మెంట్ సభ్యులు మాట్లాడుతూ యువ ప్రతిభను వెలికితీయడం, వారికి అంతర్జాతీయ స్థాయి వేదిక ఇవ్వడం తమ ప్రధాన లక్ష్యమన్నారు. క్రీడా ప్రేమికులకు చిరస్మరణీయమైన టోర్నమెంట్ అందించడం తమ ప్రత్యేకత అని చెప్పారు.






