క్షమాపణ చెప్పిన అమెరికా ఎఫ్‌డీఏ అధిపతి
కాన్వలసెంట్ ప్లాస్మాతో చికిత్స చేస్తే కొవిడ్ 19 బాధితులకు ప్రయోజనం కలుగుతుందంటూ అతిశయోక్తితో కూడిన వ్యాఖ్యలను తాను చేశానని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) అధిపతి స్టీఫెన్ హాన్ అంగీకరించారు. దీనిపై ఆయన క్షమాపణ చేప్పారు. కరోనా నుంచి కోలుకున్న వారి నుంచి సేకరించిన ప్లాస్మాతో కొవిడ్ బాధితులకు చికిత్స చేసేందుకు అనుమతిస్తూ ఎఫ్‌డీఏ నిర్ణయం తీసుకుంది. దీన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. ఇదే సమయంలో ప్లాస్మాతో చికిత్స చేస్తే మరో 35 శాతం మంది బాధితుల ప్రాణాలు నిలుస్తాయన్న ట్రంప్ వ్యాఖ్యలను హాన్ సమర్థించారు. అయితే మాయో క్లినిక్ నిర్వహించిన పరిశీలనల్లో వెల్లడైన ప్రాథమిక ఫలితాలను హాన్ ఎక్కువ చేసి చెప్పారన్న విమర్శలు వచ్చాయి. ఆయన తీరుపై శాస్త్రవేత్తలు, కొందరు మాజీ ఎఫ్‌డీఏ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సుకు ముందు ట్రంప్‌నకు ప్రయోజనం కలిగించడానికే ఆయన ఈ ప్రకటన చేశారన్న విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో హాన్ తాజా ప్రకటన చేశారు.













