జియోలో ఫేస్బుక్ పెట్టుబడులు
ఫేస్బుక్ సంస్థ రిలయన్స్ గ్రూప్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో 9.99 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ డీల్ విలువ 5.7 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 43,574 కోట్లు) ఉండనుంది. ఫేస్బుక్లో భాగమైన మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఊతంతో దేశీ ఇ కామర్స్ రంగంలో దూసుకుపోయేందుకు ఈ డీల్ రిలయన్స్‌కు తోడ్పడనుండగా.. భారత మార్కెట్లో మరింత చొచ్చుకుపోయేందుకు ఫేస్‌బుక్‌కు కూడా ఉపయోగపడనుంది. అలాగే 2021 నాటికల్లా రుణ రహిత సంస్థగా ఆవిర్భవించాలన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లక్ష్యం సాకారం కావడానికి కూడా తోడ్పడనుంది.
‘రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ. 43,574 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాం. తద్వారా అందులో అతి పెద్ద మైనారిటీ షేర్‌హోల్డరుగా ఉంటాం‘ అని ఫేస్బుక్ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఫేస్బుక్ డీల్‌తో జియో ప్లాట్‌ఫామ్స్ విలువను రూ. 4.62 లక్షల కోట్లుగా లెక్కగట్టినట్లవుతుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ప్రకటనలో పేర్కొంది. 2014లో వాట్సాప్ కొనుగోలు డీల్ తర్వాత ఫేస్బుక్ ఇంత భారీగా ఇన్వెస్ట్ చేయడం ఇదే ప్రథమం. సాధారణంగా మీడియా, ఆన్లైన్ సంస్థల్లోనే ఇప్పటిదాకా ఇన్వెస్ట్ చేస్తున్న ఫేస్బుక్ తాజాగా జియోలో పెట్టుబడులు పెట్టడాన్ని బట్టి చూస్తే.. భారత్‌లో వేగంగా పెరుగుతున్న ఆన్లైన్ పేమెంట్, ఈ కామర్స్ విభాగాల్లోని భారీ వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకునే వ్యూహంలో ఉండవచ్చని పరిశీలకులు అభిప్రాయపడ్డారు.













