‘అతి సర్వత్ర వర్ణయేత్’.. అమెరికాలో ఓవైపు లీడింగ్ లో… మరోవైపు ట్రోలింగ్ లో తెలుగువాళ్లు
అమెరికాలో తెలుగువాళ్ళ సంఖ్య ఇప్పుడు బాగా పెరిగింది. వర్జీనియా, టెక్సాస్, కాలిఫోర్నియా, జార్జియా, ఇల్లినోయిస్ వంటి రాష్ట్రాల్లో తెలుగువారి ప్రాతినిధ్యం గణనీయంగా కనిపిస్తుంటుంది. అమెరికాలో నివసిస్తున్న తెలుగువారి సంఖ్య ఇప్పుడు దాదాపు గా 2 మిలియన్ లు అంటే 20 లక్షలకు చేరింది. యూఎస్‌లో మాట్లాడే 350 భాషల్లో తెలుగు భాష ప్రస్తుతం 11వ స్థానంలో ఉంది. హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే రెండో భారతీయ భాషగా గుర్తింపు తెచ్చుకుంది. కాలిఫోర్నియాలోని శాంటా క్లారా కౌంటీలో 2020 యూఎస్ అధ్యక్ష ఎన్నికల మెయిల్-ఇన్ ఓటింగ్ రిజిస్ట్రేషన్ బ్యాలెట్ పేపర్లపై తెలుగుతో సహా ఆరు భారతీయ భాషలకు అనుమతినిచ్చారు. 2022లో టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఏప్రిల్ 2వ తేదీని రాష్ట్ర వ్యాప్తంగా “తెలుగు లాంగ్వేజ్ అండ్ హెరిటేజ్ డే”గా ప్రకటించారు. అలాగే తెలంగాణ పూల పండుగ ‘బతుకమ్మ’ అమెరికాలోని పలు నగరాల్లో ‘ఫెస్టివల్ ఆఫ్ లైఫ’గా అధికారిక గుర్తింపు పొందింది. సిలికాన్ వ్యాలీలో బలమైన ముద్ర వేసిన తెలుగు సమాజం, ఇప్పుడు యూఎస్ రాజకీయాల్లో, విధాన రూపకల్పనలో కూడా తమ ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. ప్రస్తుత యూఎస్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జెడి వాన్స్ భార్య ఉషా చిలుకూరి తెలుగు మూలాలు ఉన్న మహిళ కావడం విశేషం. అలాంటి మంచి గుర్తింపును తెచ్చుకున్న తెలుగు కమ్యనిటీ నేడు కొంతమంది చేస్తున్న విపరీత ధోరణుల కారణంగా అమెరికన్ల వ్యతిరేకతను మటగట్టుకుంటోంది.
‘అతి సర్వత్ర వర్ణయేత్’ అన్న సూక్తి ఇక్కడ ఉన్న తెలుగువారికి సరిపోతుందని చెప్పవచ్చు. ఏ విషయంలోనైనా హద్దులు దాటితే పరిణామాలు దారుణంగా ఉంటాయి. జీవితంలో మనం ఏం చేసినా చట్టాలు, హద్దులు మరియు స్థానిక నియమా లను పాటించడం చాలా అవసరం. కానీ దురదృష్ట వశాత్తూ, విదేశాల్లో స్థిరపడిన మనవారిలో ముఖ్యం గా తెలుగువారిలో కొందరు ఈ సూత్రాన్ని విస్మరిస్తూ ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా అందునా డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మరియు స్థానిక చట్టాలు గతంలో కంటే చాలా కఠినంగా అమలవుతున్న ఈ తరుణంలో తెలుగుకమÖ్యనిటీ ఇప్పుడు ఎలా ఉంటే బావుంటుందనే దాని మీద కొందరి అభిప్రాయాలను తెలుసుకుని ఈ ఆర్టికల్‌ను ఇక్కడ ప్రచురించడం జరిగింది.
పూర్వరంగం
అమెరికాలో మొదటితరం అంటే 60,70వ దశకంలో వచ్చిన తెలుగువారిలో ఎక్కువమంది డాక్టర్లు, ప్రొఫెసర్లు ఉన్నారు. విద్యార్థుల సంఖ్య స్వల్పంగానే ఉండేది. వాళ్ళు తమ తమ పనులను చూసుకుంటూ అమెరికా సొసైటీలో కలిసిపోయి కనిపించారు. ఇంగ్లీష్ చదువులు చదివిన తరువాత వాళ్ళ కల్చర్‌పై కూడా మోజు పెరిగి అమెరికా ఐడియల్ ప్లేస్ అని అనుకుంటూ వచ్చారు. 1980వ దశకంలో అమెరికాకు, ఆంధ్రప్రదేశ్ కు మధ్య రాకపోకలు పెరిగాయి. తల్లితండ్రులు, అత్తమామలు అమెరికాకు రావడం, వారు అటు వీరు ఇటు వెళ్ళడం వలన కొంత సంప్రదాయం, సంస్కృతి అటు అమెరికాలోని వారికి తెలిసింది. 1990లో తెలుగువాళ్ల సంఖ్య పెరగడంతో దాంతో పండుగల సమయాల్లోనూ, ఇతర కార్యక్రమాల్లోనూ తెలుగువారంతా కలవడం ప్రారంభించారు. అనేక నగరాల్లో తెలుగు అసోసియేషన్లు ఏర్పడటంతో తెలుగువారంతా కలిసి పండుగలు కార్యక్రమాలు చేసుకోవడం చేశారు. తెలుగు సంస్కృతీ, తెలుగు భాష అందరికీ తెలియడం మొదలైంది. పిల్లలు కూడా ఇంట్లో తెలుగు భాషను మాట్లాడటం మొదలుపెట్టారు. మన పండుగలు, ఆచార సంప్రదాయాలు తెలుసుకోవడం చేశారు. కూచిపూ డి, ఇతర సంప్రదాయ కళలను అభ్యసించడం ప్రారంభించారు.
2000కు ముబీడు వచ్చిన మిల్లీనియమ్ సంక్షోభం వలన అమెరికాలో పెద్ద ఎత్తున సాఫ్ట్ వెర్ ఇంజినీర్ల కొరత ఏర్పడటం, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన ఇంజనీరింగ్ కాలేజీల వలన సాఫ్ట్వేర్ నిపుణులు ఎక్కువ సంఖ్యలో ఉండట తో ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో సాఫ్ట్వేర్ నిపుణులు అమెరికాకు వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు కొంతమంది అక్కడే స్థిరపడిపోయారు. పెద్దఎత్తున సాఫ్ట్వేర్ నిపుణుల రాకతో అమెరికాలో తెలుగువారి సంఖ్య అప్పటి నుంచి పెరుగుతూనే వుంది. సిలికాన్‌వ్యాలీలో ఎక్కువగా మనవాళ్ళే కనిపిస్తుంటారు. దానికితోడు వీరు అమెరికాలోనూ, అటు ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువసార్లు వచ్చిపోతుం డటంతో అమెరికాకు ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌టెన్షన్‌గా మారిందనే మాట వినిపించడం ప్రారంభమైంది. తెలుగు మాట్లాడేవారి సంఖ్య మెల్లమెల్లగా మరింతగా పెరగడం ప్రారంభమైంది. నాడు వందల్లో ఉన్న తెలుగువాళ్ళ సంఖ్య నేడు లక్షల్లో కనిపిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే కొన్ని ప్రాంతాలను తెలుగు పట్టణాలుగా పిలిచే పరిస్థితులు ఏర్పడ్డాయి. అందులో డల్లాస్, కాలిఫోర్నియాలోని కొన్ని ప్రాంతాలను ముఖ్యంగా చెప్పవచ్చు.
పెరిగిన తెలుగు అసోసియేషన్లు
తెలుగు కల్చరల్ లిటరరీ అసోసియేషన్ (టిఎల్‌సిఎ) తెలుగు అసోసియేషన్లలో మొట్ట మొదటి అసోసియేషన్‌గా పేరు తెచ్చుకుంది. తరువాత కాలిఫోర్నియాలో బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) ఏర్పడింది. తరువాత చికాగోలోనూ, కొలంబియా, ఒహాయోలోనూ తెలుగు అసోసియేషన్లు ఆవిర్భవించాయి. ఇప్పుడు అన్నీ నగరాల్లోనూ తెలుగు అసోసియేషన్లు పనిచేస్తున్నాయి. ఒకట్రెండు నగరాల్లో అయితే రెండు అసోసియేషన్లు కూడా ఉన్నాయి. అసోసియేషన్లు ఎన్ని ఏర్పడినా వాటి లక్ష్యం మాత్రం తెలుగువారి సంక్షేమమే. ఇక జాతీయ స్థాయి తెలుగు అసోసియేషన్ల విషయానికి వస్తే 1975 ప్రాంతాల్లో పెద్ద పట్టణాల్లో తెలుగు అసోసియేషన్లు పనిచేస్తున్న సమయంలో దేశం మొత్తం మీద ఓ నేషనల్ బాడీ ఉంటే బావుంటుందని ఆలోచించి ‘తానా’ను ఏర్పాటు చేశారు.
తానా నుంచి ఒక గ్రూపు విడిపోయి అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా)ను ఏర్పాటు చేసుకుంది. కొద్ది సంవత్సరాల తరువాత తానా నుంచి కొంతమంది బయటకు వచ్చి ‘నాట్స’ను ఏర్పాటు చేయగా, ఆటా నుంచి వచ్చిన వాళ్ళు ‘నాటా’ను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు నాటా మూతబడింది. ప్రాంతీయ తెలుగు సం| బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా), తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (టాస్క్), తెలుగుకళాసమితి (న్యూజెర్సి), తెలుగు సార్వత్రిక సాంస్కృతిక సంఘం(టిఎల్‌సిఎ), ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్), డిట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (డిటిఎ), గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సమితి (జిడబ్ల్యుటిసిఎస్), తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (తామా), గ్రేటర్ ఇండియానాపోలిస్ (గీత), క్యాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ (క్యాట్స్), తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ డెలవర్ వ్యాలీ (టిఎజిడివి), ట్రైస్టేట్ తెలుగు అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో (టిఎజిసి), తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్ (టిఎజిబి), హ్యూస్టన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ సెయింట్ లూయిస్, తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ అస్టిన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ ఓహాయో వంటి అసోసియేషన్లు ఏర్పడ్డాయి.
ప్రతి నెలా ఏదో ఒక కార్యక్రమాన్ని తెలుగు కమÖ్యనిటీ కోసం నిర్వహిస్తున్నాయి. కొన్ని అసోసియేషన్లు అయితే నెలకు రెండు మూడుసార్లు కూడా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో ఏర్పడిన తెలుగు అసోసియేషన్లలో సభ్యుల సంఖ్య కూడా వేలల్లోనే కనిపిస్తుంటుంది. ఈ అసోసియేషన్లు తమ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా తెలుగు సినీరంగానికి చెందిన హీరో, హీరోయిన్లను, సంగీత దర్శకులను, నేపథ్యగాయనీ గాయకులను పిలుస్తుంటాయి. దీంతో సినిమాలపై ఉన్న మోజుతో తమ అభిమాన హీరోలను చూసేందుకు తెలుగు ఎన్నారైలు ఎక్కువగా మక్కువ చూపుతుండటంతో క్రమక్రమంగా తెలుగు సినీరంగానికి చెందినవాళ్ళు పెద్ద సంఖ్యలో అమెరికాకు ప్రతినెలా రావడం మొదలైంది. దీంతోపాటు అభిమానుల సంఖ్య కూడా పెద్దగా ఉండటంతో ఆయా హీరోలు నటించిన సినిమాలను అమెరికాలో కూడా అదేరోజున రిలీజ్ చేయడం ప్రారంభించారు. మొదట్లో తెలుగు సినిమాలు రిలీజ్ చేయాలంటే చాలా కష్టపడేవాళ్ళు ఇప్పుడు సాంకేతిక నైపుణ్యం పెరగడంతో తెలుగు రాష్ట్రాలతోపాటు అమెరికాలో కూడా ఒకేరోజున హీరోల సినిమాలు రిలీజవుతున్నాయి.
మారిన పరిస్థితులు
నేడు అమెరికాలో దాదాపు 12 లక్షల మందికి పైగా తెలుగువారు నివసిస్తున్నారు. ఇంగ్లీష్ తర్వాత అత్యంత వేగంగా పెరుగుతున్న రెండో భారతీయ భాషగా తెలుగు నిలిచింది. 2000 సంవత్సరంలో కంప్యూటర్ వ్యవస్థల్లో తలెత్తిన 2కె బగ్ సమస్యను పరిష్కరించడంలో భారతీయ ఐటీ నిపుణులు కీలక పాత్ర పోషించడంతో అమెరికన్ల కంపెనీలు తమ తమ ఐటీ కంపెనీల్లో తెలుగువారికి కూడా అవకాశాన్ని కల్పించింది. తెలుగు తల్లిదండ్రులు విద్యకు ఇచ్చిన ప్రాధాన్యత కారణంగా 2010 నాటికి ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య 700 దాటి, భారీ స్థాయిలో ఐటీ టాలెంట్ రూపుదిద్దుకుంది. దీంతో పెద్ద సంఖ్యలో తెలుగు యువతీ యువకులు అమెరికాలో ఐటీ రంగంలో ఉద్యోగాన్ని సంపాదించు కున్నారు. ఇక్కడే ఉండిపోయి సొంతంగా ఐటీ కంపెనీలను ఏర్పాటు చేసుకుని నిర్వహిస్తున్నారు కూడా. మరోవైపు ఐటీరంగంలో తాము సంపాదించు కున్న డబ్బును జల్సాలు చేయడంలో తెలుగువాళ్లే ముందుంటారు. కొత్త కార్లను కొనుగోలు చేయడంలోనూ, పెద్ద పెద్ద భవంతులను కొనుగోలు చేయడంలోనూ తెలుగు వాళ్ళ సంఖ్య పెరుగుతూ వస్తోంది. తమ సాంకేతిక నైపుణ్యంతో వారు డబ్బులు సంపాదించుకుంటున్నా, ఆ డబ్బులతో వారు జల్సాలు చేస్తున్నా ఇది సమాజంలో అసమానతలను పెంచుతూ వచ్చింది.
కుల పిచ్చి…
అమెరికాలో తెలుగు అసోసియేషన్లు, గ్రూపులు కేవలం సాంస్కృతిక సేవలకు పరిమితం కాకుండా ప్రాంతీయ, కుల రాజకీయాలకు వేదికలుగా మారుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేట్ కంపెనీలు లేదా టీమ్‌లలో తెలుగు మేనేజర్లు కేవలం తమ కులం లేదా తెలుగువారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ నైతిక సూత్రాలను పక్కన పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దానికితోడు తమ కులం హీరో వస్తే అట్టహాసంగా వేడుకలతో స్వాగతం పలకడం వంటివి కూడా ఎక్కువయ్యాయి. ఇలాంటి వాటి వల్ల తెలుగువాళ్ళ పరువుపోతోందని పలువురు వాపోతున్నారు.
ఫేక్ కన్సల్టెన్సీలు-వీసా స్కామ్‌లు
అమెరికా వెళ్లాలనే విపరీతమైన క్రేజ్‌ను ఆసరాగా చేసుకుని కొన్ని నకిలీ కన్సల్టెన్సీలు, ఫేక్ యూనివర్సిటీలు విద్యార్థులను మోసం చేస్తున్నాయి లక్షలాది రూపాయల లోన్లు తెచ్చి మోసపోవడం, డిపోర్టేషన్‌కు గురై కుటుంబాలు రోడ్డున పడటం వంటి ఉదాహరణలు పెరుగుతున్నాయి. మరోవైపు ఇలాంటి వాటిల్లో తెలుగువాళ్ళ పేర్లు బయటకు రావడం ఇటీవల జరగడంతో తోటి తెలుగువాళ్ళంతా అనుమానాలకు గురవుతున్నారు.
సోషల్ మీడియా రీల్స్
అమెరికాలోని వివిధ బహిరంగ ప్రదేశాల్లో డ్యాన్స్ వీడియోలు తీస్తూ, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న పలువురు తెలుగు వ్యక్తుల కారణంగా ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ఈ రీల్స్ వల్ల అందరి దృష్టి తెలుగువాళ్ళపై పడటంతో వాళ్ళపై ఇంటర్నెట్లో తీవ్ర స్థాయిలో ద్వేషపూరిత విమర్శలు, వేధింపులు వెల్లువెత్తుతున్నాయి. స్మారక చిహ్నాలు, చారిత్రక కట్టడాలు మరియు రద్దీగా ఉండే ప్రాంతాల వద్ద తెలుగు డ్యాన్సర్లు చేసిన వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో ఎంత అలజడి సృష్టించాయో తెలిసిందే. దీనివల్ల వారు ఎన్నో ఇబ్బందనలు ఎదుర్కోవలసి వచ్చింది. ట్రోలింగ్ లతో రీల్స్ చేసిన ఓ వ్యక్తి తన వీడియోలను తొలగించడమేకాకుండా సోషల్ మీడి యాను కూడాడీ యాక్టివేట్ చేసుకోవలసి వచ్చింది.
‘డల్లాస్‌పురం’ వివాదం
ఇటీవలి కాలంలో టెక్సాస్‌లోని డల్లాస్ వంటి నగరాల్లో నివసిస్తున్న కొందరు తెలుగు వ్యక్తుల ప్రవర్తన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. నగరంలోని కొన్ని ప్రాంతాలను అనధికారికంగా “డల్లాస్‌పురం” అని పిలుచుకోవడం, సోషల్ మీడియా రీల్స్ మరియు వ్యూస్ కోసం బహిరంగ రోడ్లు, చారిత్రక ప్రాంతాల్లో డ్యాన్సులు చేస్తూ హంగామా చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికులు లేదా అధికారులు ఈ ప్రవర్తనను అభ్యంతరం తెలిపినప్పుడు, తమ తప్పును తెలుసుకోవడానికి బదులుగా కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దాన్ని “భారతీయ సంస్కృతిపై దాడి” అని వివక్షారంగు పూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఒక శ్వేతజాతి అమెరికన్ ఒక తెలుగు వ్యక్తితో “గో బ్యాక్ టు ఇండియా” (వెనక్కి వెళ్ళిపోండి) అని అనడం, దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది.
నమ్మకాన్ని వమ్ము చేసే చర్యలు…
అసలు మనవాళ్లు అమెరికాకు ఎందుకు వెళ్తు న్నారు? ఎక్కువమంది భారతీయ తల్లిదండ్రులు తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం, ఉన్నత విద్య, హెచ్ 1బి వీసా, గ్రీన్ కార్డ్ మరియు సిటిజన్‌షిప్ కోసం లక్షలాది రూపాయల కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెడుతున్నారు. కానీ కొందరి బాధ్యతారాహిత్యమైన చర్యలు ఆ కలలన్నింటినీ నాశనం చేసేలా ఉన్నాయి. ప్రస్తుతం అమెరికన్ అధికారులు నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా దారులపై ప్రత్యేక నిఘా ఉంచారని, వారి సోషల్ మీడియా కార్యకలాపాలను సైతం పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. హద్దులు దాటి ప్రవర్తించే వారికి చట్టపరమైన నోటీసులు ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు.
వ్యాపార రంగంలో, ముఖ్యంగా డల్లాస్‌లో పెరుగుతున్న ‘బిర్యానీ కల్చర’.. భారతీయ రెస్టారెంట్ల విజయంలో తప్పు లేదు. వ్యాపారపరంగా సక్సెస్ సాధించడం అభినందనీయమే. కానీ, దాన్ని ప్రమోట్ చేసే క్రమంలో ఒక అమెరికన్ నగరాన్ని ‘డల్లాస్‌పురం’ అని పిలుస్తూ స్థానికులకు చికాకు తెప్పించేలా ప్రచారం చేయడం అనవసర వివాదా లకు కారణమవుతోంది. అమెరికాలో ఉన్న భారతీ యులు, ముఖ్యంగా తెలుగువారు అత్యంత బాధ్యతా యుతంగా వ్యవహరించాల్సిన సమయం ఇది. స్థానిక చట్టాలను, సంస్కృతిని గౌరవిస్తూ, సోషల్ మీడియా లో ఏది పోస్ట్ చేయాలనే దానిపై ఆలోచించాలి. చిన్న నిర్లక్ష్యం లేదా సోషల్ మీడియాలో కాసేపు వచ్చే ప్రచారం కోసం చేసే పిచ్చి పనులు మీ భవిష్యత్తును, వీసా స్థితిని ప్రమాదంలో పడేస్తాయన్న విషయాన్ని గుర్తుంచకపోవడం దారుణమని చెప్పవచ్చు.
ముదిరిన సినీ అభిమానం
సినిమా హంగమా వివాదాలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పుడు అమెరికాలోని ప్రముఖ మల్టీప్లెక్స్ థియేటర్ల వద్ద డప్పులు కొట్టడం, పేపర్లు చల్లడం, కటౌట్లకు పాలాభిషేకాలు చేయడం వంటి హంగామా స్థానిక అమెరికన్లతో పాటు ఇతరులకు ఇబ్బందిని కలిగించింది. దాంతో పబ్లిక్ ప్రాపర్టీకి ఇబ్బంది కలగడంతో, థియేటర్ యాజమాన్యాలు వార్నింగ్‌లు ఇవ్వడం వంటి సంఘటనలతో తెలుగువారి పరువుపోతోందని పెద్దలు వాపోతున్నారు.
పెరుగుతున్న విదేశీ వ్యతిరేక భావజాలం
ఈ మధ్యకాలంలో అమెరికాలో విదేశీ వ్యతిరేక భావజాలం పెరిగినట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో ఇండియన్లపై దారుణంగా ద్వేషాన్ని ముఖ్యంగా తెలుగువారిపై డల్లాస్‌లో వెళ్ళగక్కడం కనిపిస్తోంది. యూ ట్యూబ్ కంటెంట్ క్రియేటర్లు తమ వ్యూస్ కోసం దారుణంగా తెలుగువాళ్ళ ఇంటికి వెళ్ళి వారి పాస్ పోర్టులు ఇతర వ్యవహారాల గురించి ప్రశ్నించడం చూపించకపోతే వారి గురించి తమ యూట్యూబ్ ద్వారా విరుచుకుపడటం ఎక్కువైంది. ఇందులో ఒకరో ఇద్దరు తప్పు చేసి ఉంటే దాని ప్రభావం అందరిమీద పడుతోందని అంటున్నారు. ఇలాంటి వీడియోలు ఒక్కసారిగా మొత్తం తెలుగు సమాజాన్ని అందరి దృష్టిలో పడేలా చేస్తున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇది అనవసర శ్రద్ధను ఆకర్షించడమే కాకుండా ప్రమాదకరంగా పరిణమిస్తుందోనని కొందరు పేర్కొంటున్నారు. అలాగే హౌస్టన్‌లో మహా లక్క్ష్మి టెంపుల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 90 అడుగుల శ్రీ హనుమాన్ విగ్రహం మీద కూడా పెద్ద కాంట్రావర్సీ నడవడం మనం చూస్తున్నాం.
ఏమి చేయాలి…
ఎన్నారై పెద్దల మాట
అమెరికాలో ఉన్నప్పుడు అమెరికా చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. దానికి అనుగుణం గా నడుచుకోవాలి. అమెరికా చట్టాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించరాదు. ట్రాఫిక్ నియమాలు నుండి వీసా నిబంధనల వరకు అన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. అనుచిత ప్రవర్తన, మద్యపానం తరువాత వాహనం నడపడం, హింసాత్మక ప్రవర్తన వంటివి పూర్తిగా నివారించాలి. పాలు, అభిషేకాలు, ర్యాలీలు వంటివి చేయడం మంచిది కాదు. ఇలాంటివి చేయడం వల్ల మనం అందరి దృష్టిలో పడి జాత్యంహకారానికి గురయ్యే పరిస్థితి వస్తోంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.








