ఏఐలో భారత్ సత్తా చాటే సమయం వచ్చింది
ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ, కోట్ల డాలర్ల పెట్టుబడులు, టాప్ టెక్ టాలెంట్, అత్యంత ఖరీదైన కంప్యూటింగ్ సిస్టమ్స్. ఏఐ లాంటి టెక్నా లజీని అభివృద్ధి చేయడానికి కావాల్సిన ప్రతిదీ అక్కడ అందుబాటులో ఉన్నట్టే అనిపిస్తుంది. మరి అలాంటి చోటుతో భారత్ ఎలా పోటీ పడగలదు? ఏఐ రేసులో గెలవడానికి ప్రతీసారీ ఎక్కువ డబ్బు, అత్యాధునిక పరికరాలే కావాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో లిమిటేషన్స్ (పరిమితులే) పెద్ద ప్రయోజనంగా మారతాయి. భారత్‌కు ఇప్పుడు అలాంటి ప్రయోజనమే ఉందనే వాదన అంతర్జాతీయ సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారుతోంది.
ఒక టెక్నాలజీ గొప్పదని ఎప్పుడు చెప్పాలి?
ఒక ఏఐ సిస్టమ్‌ను అత్యాధునిక ల్యాబ్‌లో పెట్టి పరీక్షిస్తే అది అద్భుతంగా పనిచేయొచ్చు. వేగవంతమైన ఇంటర్నెట్, శక్తివంతమైన కంప్యూట ర్లు, ఖరీదైన హార్డ్‌వేర్, నిపుణులైన టీమ్ అన్నీ అందుబాటులో ఉంటే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ అదే టెక్నాలజీని ఇంటర్నెట్ అంతంతమాత్రంగా ఉన్న ప్రాంతంలోకి తీసుకెళ్లండి. తక్కువ సామర్థ్యం ఉన్న పరికరంలో నడపండి. దాన్ని ఉప యోగించే వ్యక్తికి టెక్నాలజీపై పెద్దగా అవగాహన లేకపోతే ఎలా పనిచేస్తుందో చూడండి. పైగా ఆ సేవకు ఎక్కువ డబ్బు చెల్లించే పరిస్థితి కూడా లేకపోతే?
అక్కడే అసలు పరీక్ష మొదలవుతుంది.
ఇక్కడ టెక్నాలజీని అభివృద్ధి చేసేవాళ్లు మొదటి నుంచే కనెక్టివిటీ, ఖర్చు, హార్డ్‌వేర్, మౌలిక సదుపాయాలు, వినియోగదారుల వైవిధ్యం వంటి సమస్యలను దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకే ఒక పరిష్కారం కేవలం ల్యాబ్‌లో బాగా పనిచేస్తే సరిపోదు. అది నిజ జీవితంలో కూడా నిలబడాలి. ఈ అలవాటే ఇప్పుడు భారత్‌కు ఒక ప్రత్యేకమైన స్ట్రెంత్‌గా మారుతోందని విశ్లేషకలు అంటున్నారు.
పరిమితులున్నప్పుడు ఇన్నోవేషన్ మారుతుంది
వనరులు అపారంగా ఉంటే ఒక సమస్యకు పది రకాల పరిష్కారాలు ప్రయత్నించవచ్చు. కానీ వనరులు పరిమితంగా ఉంటే ఏది నిజంగా అవసరమో ముందే నిర్ణయించుకోవాలి. ఇక్కడే భారత టెక్ డెవలప్మెంట్కు ఒక ప్రత్యేకమైన స్వభావం ఏర్పడింది. ఖర్చు గురించి మొదటి నుంచే ఆలోచించాలి. తక్కువ సామర్థ్యం ఉన్న పరికరాల్లో కూడా పనిచేసేలా డిజైన్ చేయాలి. ఇంటర్నెట్ ఎప్పుడైనా నెమ్మదించవచ్చని ఊహించుకోవాలి. దీంతో ఒక విషయం జరుగుతుంది. టెక్నాలజీ అందంగా కనిపించడం కంటే ఉపయోగకరంగా ఉండటం ముఖ్యం అవుతుంది. వ్యవసాయం నుంచి బ్యాంకింగ్ వరకు, తయారీ నుంచి గ్రామీణ ఆరోగ్యం వరకు భారత్‌లో టెక్నాలజీ ఎదుర్కొనే సమస్యలు కూడా చాలా వాస్తవమైనవి. అందుకే ఇక్కడ తయారయ్యే పరిష్కారాలు కాగితంపై బాగుండటమే కాకుండా, బయట ప్రపంచంలో పని చేస్తూంటాయి.
ఒకప్పుడు భారత్‌ది వేరే పాత్ర
ఇది ఎప్పటి నుంచో ఇలా లేదు. ఒకప్పుడు ప్రపంచ టెక్ పరిశ్రమలో భారత్ గురించి మాట్లాడేటప్పుడు ప్రధానంగా అవుట్ సోర్సింగ్, కోడింగ్, టెస్టింగ్, సపోర్ట్ వంటి పదాలే వినిపించేవి. ఆలోచన, ఉత్పత్తి డిజైన్, కొత్త టెక్నాలజీ సృష్టి ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో జరిగేది. వాటిని అభివృద్ధి చేసి, అమలు చేయడంలో భారత్ పెద్ద పాత్ర పోషించేది. పాశ్చాత్య దేశాలు డిజైన్లు చేస్తాయి. దానిని ఇండియా అభివృద్ధిపరుస్తుంటుంది. అంటే డిజైన్ అక్కడ, డెవలప్మెంట్ ఇక్కడ. అయితే మారిన కాలమాన పరిస్ధితుల్లో ఇప్పుడు ఆ కథలో కొత్త అధ్యాయం మొదలైంది. భారతీయ కంపెనీలు ఇతరులు ఇచ్చిన ఉత్పత్తులను మాత్రమే అభివృద్ధి చేయడం లేదు. స్వయంగా డిజైన్ చేస్తున్నాయి, నిర్మిస్తున్నాయి, ప్రపంచ మార్కెట్లకు తీసుకెళ్తున్నాయి. ఇప్పుడు అన్నీ చేసే సామర్థ్యం ఇండియాకు ఉంది. భారత్ ఇక ప్రపంచ టెక్ పరిశ్రమకు వెనుక పనిచేసే బ్యాక్ ఆఫీస్ కాదు.. తన సొంత టెక్నాలజీని నిర్మించ గల సామర్థ్యం ఉన్న కేంద్రంగా ఎదుగుతోంది.
టెక్ కంపెనీలు భారత్ నుంచి ఏం నేర్చుకోవచ్చు?
బహుశా భారత్ నుంచి నేర్చుకోవాల్సిన అతిపెద్ద విషయం ఇదే: పరిమితులు వచ్చాక వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించకండి. మొదటి నుంచే వాటిని డిజైన్‌లో భాగం చేసుకోండి. ఇంటర్నెట్ బలహీనంగా ఉండొచ్చని ముందే తెలుసుకుంటే, ఆ పరిస్థితిలోనూ పనిచేసే సిస్టమ్‌ను నిర్మించాలి. పరికరాలు ఖరీదైనవైతే తక్కువ సామర్థ్యం ఉన్న హార్డ్‌వేర్‌లోనూ పనిచేసేలా చూడాలి. వినియోగదారులు భిన్నంగా ఉంటే వారి అవసరాలను మొదటి నుంచే పరిగణనలోకి తీసుకోవాలి. ఇది వింటే చాలా సింపుల్‌గా అనిపించొచ్చు. కానీ ఉత్పత్తి రూపకల్పనలో ఈ ఆలోచన చాలా పెద్ద మార్పు తీసుకురాగలదు. ఇవన్నీ చూస్తూంటే రాబోయే రోజుల్లో ప్రపంచం భారత్‌కు టెక్నాలజీని పంపడం మాత్రమే కాకుండా, భారత్ నుంచి టెక్నాలజీని తీసుకోవడం కూడా మొదలుపెట్టవచ్చు.
భారత్‌నే ఎందుకు ఇంత పెద్ద టెస్టింగ్ గ్రౌండ్‌గా చూడొచ్చు?
ఇక్కడి మార్కెట్‌ను ఒక్క మాటలో చెప్పాలంటే వైవిధ్యం. ఒక వైపు ప్రపంచ స్థాయి డిజిటల్ సేవలు ఉపయోగించే మెట్రో నగరాల వినియోగదారులు ఉంటారు. మరోవైపు పరిమితమైన ఇంటర్నెట్తో, తక్కువ సామర్థ్యం ఉన్న పరికరాలతో డిజిటల్ సేవలను ఉపయోగించాల్సిన కోట్లాది మంది ఉంటారు. కొందరికి ఇంగ్లిష్ సౌకర్యంగా ఉంటుంది. మరికొందరికి స్థానిక భాషే అవసరం. కొందరు కొత్త టెక్నాలజీని వెంటనే అర్థం చేసుకుంటారు. ఇంకొందరికి చాలా సింపుల్ ఇంటర్ఫేస్ కావాలి.
ఇంత విభిన్నమైన వినియోగదారులు ఒకే మార్కెట్లో ఉండటం టెక్నాలజీకి పెద్ద పరీక్షే. ఒక ఏఐ ఉత్పత్తి ఇలాంటి పరిస్థితుల్లోనూ సజావుగా పనిచేయగలిగితే, ప్రపంచంలోని ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు దాన్ని తీసుకెళ్లడం సులభమయ్యే అవకాశం ఉంది. అందుకే భారత్ ఒక పెద్ద మార్కెట్ మాత్రమే కాదు. ఒక భారీ రియల్-వరల్డ్ టెస్టింగ్ గ్రౌండ్ కూడా.
దేశంలో సుమారు 40 లక్షల సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ప్రతి ఏడాది సుమారు 7 లక్షల మంది టెక్ నిపుణులు కొత్తగా ఉద్యోగ మార్కెట్లోకి వస్తున్నారు. అంతేకాదు, భారత జనాభాలో సుమారు 65 శాతం మంది 35 ఏళ్లలోపు వారే. కొత్త టెక్నాలజీని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న భారీ యువత, ఇప్పటికే అనుభవం సంపాదించిన టెక్ వర్క్‌ఫోర్స్… ఈ రెండూ కలిసి భారత్‌ని నెక్ట్స్ లెవిల్లో నిలబెడుతున్నాయి. అమెరికాతో పోలిస్తే డెవలప్మెంట్, టెస్టింగ్ కార్యకలాపాలను తక్కువ ఖర్చుతో నిర్వహించగల అవకాశం ఉంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని టీమ్‌లతో కలిసి పనిచేయడం వల్ల దాదాపు 24/7 డెవలప్మెంట్ సైకిల్ కూడా సాధ్యమవుతుంది. ఏఐ అంటే కేవలం సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కాదు. దానికి భారీ డేటా సెంటర్లు, విద్యుత్, కూలింగ్, కనెక్టివిటీ వంటి మౌలిక సదుపాయాలు కూడా కావాలి. ఆ విషయంలోనూ భారత్‌లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు 2025లో సుమారు 190 బిలియన్ డాలర్ల నుంచి 2026లో 205 బిలియన్ డాలర్లకు పెరిగాయని, 2031 నాటికి నాటికి 302 బిలియన్ డాలర్లకు చేరవచ్చని మోర్దార్ ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. భారత్‌లో ఏఐ మార్కెట్ కూడా వేగంగా పెరుగుతోంది. డెలాయిట్ అంచనా ప్రకారం ఇది 2027 నాటికి 20 బిలియన్ డాలర్లకు చేరవచ్చు. అంటే ఏఐకి అవసరమైన టాలెంట్ ఒక వైపు, మార్కెట్ మరో వైపు, మౌలిక సదుపాయాలు ఇంకో వైపు మూడు కలిసి ఒక ఎకోసిస్టమ్‌గా తయారవుతున్నాయి.
ఎఐ పరిశోధనలకు భారతీయ దంపతుల రూ.190 కోట్ల విరాళం!
అమెరికాలో స్థిరపడ్డ తెలుగు దంపతులు వికాస్ సిన్హా-అనురాధ దంపతులు మరోసారి మంచి మనసు చాటుకున్నారు. తెలుగు మూలాలున్న వీరు యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌కు 20 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.190 కోట్లు) విరాళంగా అందజేశారు. వికాస్ సిన్హా హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఉండే కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్నారు. 1984-88లో శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసి పై చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ మాస్టర్స్ చేసిన తర్వాత ఉద్యోగం చేస్తూ యూఎస్‌లోనే స్థిరపడ్డారు. టెక్ రంగంలో అంచెలంచెలుగా ఎదిగిన సిన్హా.. ప్రస్తుతం బ్రాడ్‌కామ్ కంపెనీలో మెయిన్ ఫ్రేమ్ సాఫ్ట్వేర్ విభాగానికి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. దాంతో పాటు యూఎస్టీ కాలేజీలో ఇన్ఫర్మేషన్ లీడర్షిప్ బోర్డులోనూ సేవలందిస్తున్నారు. ఇదే యూనివర్సిటీకి ఈ దంపతులు గతంలోనూ విరాళం అందించారు. వీళ్లు అందజేసిన విరాళాలతో ఏఐ, అడ్వాన్స్డ్ అనలటిక్స్ కాలేజీలో నాణ్యమైన విద్యతో పాటు పరిశోధనలను విస్తరిస్తామని వర్సిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ సహాయానికి గుర్తుగా ఏఐ విభాగానికి అనురాధ-వికాస్ సిన్హా పేర్లు పెడుతామని వర్సిటీ ప్రకటించింది.
ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్న వికాస్, అనురాధ సిన్హాల కథను తెలుసుకుంటే.. ఈ రూ.167 కోట్ల విరాళం వెనుక ఉన్న అసలు విలువ అర్థమవుతుంది. వీళ్ల ప్రయాణం అమెరికాలో మొదలైంది కాదు. ఆంధ్రప్రదేశ్‌లో మొదలైంది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్న ఈ దంపతులు.. ఆ తర్వాత కర్నూలులోని జి. పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఉన్నత విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో అమెరికా వెళ్లారు. అక్కడ ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ డిగ్రీలు పూర్తి చేశారు. తనకు కోట్ల రూపాయల విరాళం అందించిన యÖనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ నుంచే 2023లో పిహెచ్డి పూర్తి చేశారు. అంటే.. ఒకప్పుడు ఈ యూనివర్సిటీకి విద్యార్థిగా వెళ్లిన వ్యక్తే.. ఇప్పుడు అదే యూనివర్సిటీ భవిష్యత్తును మార్చే స్థాయిలో దాతగా నిలిచారు. ప్రస్తుతం వికాస్ సిన్హా బ్రాడ్ కామ్‌లో మెయిన్ ఫ్రేమ్ సాఫ్ట్ వేర్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. 2023 నుంచి యుఎన్టి కాలేజీ ఇన్ఫర్మేషన్ లీడర్షిప్ బోర్డ్‌లో సభ్యుడిగా ఉన్నారు. రూ.167 కోట్ల విరాళం ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదు. యుఎన్టితో వారి అనుబంధం ఇప్పటికే ఎన్నో దశల్లో పెరిగింది. ఎన్నో కార్యక్రమాలకు వారు విరాళాలను ఇచ్చారు. వికాస్ సిన్హా చెప్పినట్లుగా.. విద్య తమ జీవితాల్లో ఎన్నో తలుపులు తెరిచింది. ఇప్పుడు ఆ తలుపులు మరెందరికో తెరిచి ఉంచాలనుకుంటు న్నారు. అందుకే ఈ విరాళం కేవలం తమకు చదువు చెప్పిన సంస్థకు ఇచ్చిన కృతజ్ఞత కాదు. తమకు దక్కిన అవకాశాన్ని.. తమ తర్వాతి తరానికి అందించే ప్రయత్నం అని వివరించారు.








