తానా ఫౌండేషన్ కార్యదర్శిగా విద్యాధర్ గారపాటి ఎన్నిక
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఫౌండేషన్ కార్యదర్శిగా విద్యాధర్ గారపాటి ఎన్నికయ్యారు. 2023-25 సంవత్సరానికిగాను ఆయన కార్యదర్శి బాధ్యతలను నిర్వహించనున్నారు. తానాలో వివిధ పదవులను నిర్వహించడంతోపాటు తానా ద్వారా, సొంత నిధుల ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను ఆయన అటు అమెరికాలోనూ, ఇటు తెలుగు రాష్ట్రాలోనూ నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని చాగల్లుకు చెందిన విద్యాధర్ గారపాటి రెండు దశాబ్దాల క్రితమే అమెరికాకు వెళ్ళి స్థిరపడ్డారు. ఉద్యోగంలో చేరి, తరువాత సొంతంగా బిజినెస్ చేస్తూ ఎంట్రప్రెన్యూరర్‌గా పేరు తెచ్చుకున్నారు. మూవర్స్ డాట్ కమ్, ఎన్జిఎ గ్రూపు ఇంక్‌కు ఆయన సిఇఓగా వ్యవహరిస్తున్నారు. అలాగే కమ్యూనిటీకి ఏదైనా సేవ చేయాలన్న సంకల్పంతో తానాలో చేరారు. తానాలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అటు అమెరికాలోనూ, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనివారికి సేవలందిస్తున్నారు. తన సొంత నిధుల నుంచి దాదాపు 75,000,00 డాలర్లను ఆయన ఇంతవరకు సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టారు. అమెరికాలో తానా కాని, నాటా కాని, నాట్స్ లేదా టిటిఎ లాంటి జాతీయ తెలుగు సంఘాలు నిర్వహించే మహాసభలకు వచ్చేవారి దాహాన్ని తీర్చేందుకు లక్షల రూపాయల విలువ చేసే మంచినీటి బాటిళ్ళను అందజేస్తున్నారు. ఇటీవల ఫిలడెల్పియాలో జరిగిన తానా మహాసభల్లో 70,000 వాటర్ బాటిళ్ళను అందజేశారు.
తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ లాంటి మహమ్మారి నుంచి రక్షించేందుకు వీలుగా తానా ద్వారా, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా క్యాన్సర్ నిర్దారణ క్యాంప్‌లను వివిధ చోట్ల నిర్వహించి అవసరమైనవారికి వైద్యసహాయాన్ని అందేలా చూశారు. అలాగే ఏ అవసరం వచ్చినా తనవంతుగా విరాళాన్ని ఇచ్చేందుకు ఎల్లప్పుడూ ముందుంటారు. తానాకోసం లక్షలాది రూపాయలను ఆయన విరాళంగా ఇచ్చారు. తానా ఫౌండేషన్ కార్యక్రమాలకోసం లక్షలాది రూపాయలను ఆయన తన స్నేహితుల నుంచి, బంధువుల నుంచి ఇతరుల నుంచి సేకరించి ఇచ్చారు. తానా ద్వారా హైస్కూల్ విద్యార్థులకోసం శాట్ లాంటి వాటిలో కోచింగ్‌ను ఇప్పిస్తున్నారు.
ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించిన అనుభవంతో తానా ఫౌండేషన్ కార్యదర్శిగా మరిన్ని సేవా కార్యక్రమాలను కమ్యూనిటీకి అందించనున్నట్లు విద్యాధర్ గారపాటి తెలిపారు.













