ఐరాస సదస్సుకు డీటీడీవో అఖిలేశ్‌రెడ్డి
చైనా రాజధాని బీజింగ్‌లో నిర్వహించే ఐక్యరాజ్యసమితి సదస్సుకు నాగర్‌కర్నూల్ జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి అఖిలేశ్ రెడ్డి ఎంపికయ్యారు. డిసెంబర్ 2 నుంచి 6 వరకు 49 దేశాల ప్రతినిధులతో ఐక్యరాజ్యసమితి నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు హాజరుకానున్నారు. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు పరిచిన 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమానికి అఖిలేష్‌రెడ్డి కొల్లాపూర్ మండల ప్రత్యేకాధికారిగా పనిచేశారు. కొల్లాపూర్ మండలం సోమశీల గ్రామంలో నిర్వహించిన 30 రోజుల ప్రణాళిక అమలుపై అధ్యయనం చేసిన నివేదికను ఐక్యరాజ్యసమితికి నివేదించారు. అందుకు ఆకర్షితులైన ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు చైనా రాజధాని బీజింగ్ తసింఘా యూనివర్సిటీలో స్పీచ్ ఏషియా లీడర్షిప్ అకాడమీ ఆన్ సర్క్యులర్ ఎకానమీ సెమినార్లో ప్రణాళిక తీరుతెన్నులను నివేదించడానికి ఐరాస ఆహ్వానించింది. దేశం నుంచి ముగ్గురికి ఆహ్వానం అందగా అందులో రాష్ట్రం తరుపున నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి 2017వ సంత్సరం గ్రూప్-1 బ్యాచ్‌కు చెందిన జిల్లా సాంఘిక సంక్షేమాధికారి తలసాని అఖిల్‌రెడ్డి ఎంపిక కావడంతో కలెక్టర్, ఇతర శాఖల జిల్లా అధికారులు అభినందనలు తెలిపారు.













