తనపై తనకే జాలేస్తోందన్న డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనపై తానే జాలి పడుతున్నారు. డెమొక్రాట్ల కోసం ఎదురుచూస్తూ వైట్ హౌస్లో ఒంటరిగా గడుపుతున్నానన్నారు. అమెరికా- మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం విషయంలో డెమొక్రాట్లు తనతో కలిసి రాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ట్రంప్ ఇచ్చిన ఓ ట్వీట్లో కచ్చితంగా అవసరమైన సరిహద్దు భద్రతపై ఒప్పందం కోసం డెమొక్రాట్లు తిరిగి వస్తారని వైట్ హౌస్లో నేను ఒంటరిగా (నా మీద నాకే జాలిగా ఉంది) ఎదురు చూస్తున్నాను. డెమొక్రాట్లు అంగీకారానికి రాకపోవడం ఏదో ఒక సమయంలో మన దేశానికి మనం మాట్లాడుకుంటున్న సరిహద్దు గోడకు అయ్యే ఖర్చు కన్నా ఎక్కువ నష్టం జరుగుతుంది. వెర్రితనం అని పేర్కొన్నారు.
ట్రంప్ అమెరికా హోం లాండ్ సెక్యూరిటీ సెక్రటరీతో సమావేశమయ్యారు. సరిహద్దు భద్రత గురించి చర్చించారు. అమెరికా-మెక్సిసో సరిహద్దుల్లో గోడ నిర్మాణంపై డెమొక్రాట్లు విభేదిస్తున్న నేపథ్యంలో ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రభుత్వ వ్యవహారాలకు పాక్షిక ఇబ్బందులు తలెత్తాయి. ఈ ప్రతిష్టంభనను నివారించేందుకు డెమొక్రాట్లు, రిపబ్లికన్లు పరస్పరం కొన్ని ఆఫర్లు ఇచ్చుకున్నారు. కానీ సరిహద్దు గోడకు నిధులు లేకుండా ఎటువంటి ఆఫర్పైనా అంగీకరించలేదని వైట్ హౌస్ పట్టుబడుతోంది. దీనికి డెమొక్రాట్లు ససేమీరా అంటున్నారు.













