భారత సంతతి మహిళకు ట్రంప్ ప్రభుత్వంలో అత్యున్నత పదవి
భారతీయులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ శుభవార్త చెప్పారు. ఇప్పటికే అత్యధిక సంఖ్యలో భారత అమెరికన్లు ట్రంప్ సర్కారులో కొలువైన ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో భారత అమెరికన్‌కు ప్రభుత్వంలో అత్యున్నత పదవిని కట్టబెట్టేందుకు ట్రంప్ నిర్ణయించారు. 45 ఏళ్ల మనీషా సింగ్ అనే ఎన్నారైను తమ ప్రభుత్వంలో కీలక పోస్ట్‌కు నామినేట్ చేయాలని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం సెనేటర్ డాన్ సలేవన్కు సలహాదారుగా ఉన్న ఆమెను, స్టేట్ ఎకనామిక్ అఫైర్స్ అసిస్టెంట్ సెక్రటరీ పోస్ట్‌కు నామినేట్ చేసే అవకాశం ఉందని వైట్‌హౌస్ వర్గాలు చెబుతున్నాయి.
ఫ్లోరిడాకు చెందిన మనీషా సింగ్ గతంలో బ్యూరో ఆఫ్ ఎకనామిక్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేశారు. ఎనర్జీ అండ్ బిజినెస్ అఫైర్స్, సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీల్లో కూడా ఆమె విధులు నిర్వర్తించారు. న్యాయవాద వృత్తిలో కొన్నళ్ల పాటు సేవలు అందించారు. చిన్నతనంలో ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు ఉత్తర ప్రదేశ్ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. అమె విద్యాభ్యాసం అంతా అమెరికాలోనే జరిగింది. చిన్నతనంలోనే అమెరికాకు వచ్చి అక్కడే పెరిగి పెద్దయి చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది మంది విదేశీయుల వర్క్ పర్మిట్‌ను రద్దు చేసిన ట్రంప్, తాజాగా అదే విధంగా అమెరికాకు వచ్చిన ఓ భారత అమెరికన్‌కు అత్యున్నత పదవిని కట్టబెట్టేందుకు ట్రంప్ యోచిస్తుండటం మాత్రం చర్చనీయాంశంగా ఉంది. ఏదిఏమైనా ఓ భారత సంతతి మహిళ అమెరికా ప్రభుత్వంలో అత్యున్నత పదవికి ఎంపిక కాబోతుండటంతో అమెరికాలోని భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు.













