హెచ్ 1బీ మరింత కఠినం
భారతీయ ఐటీ కంపెనీలు, ఉద్యోగులపై పెను ప్రతికూల ప్రభావం చూపేలా హెచ్- 1 బీ వీసాల జారీలో అమెరికా భారీ మార్పులు చేసింది. విదేశీ కంపెనీల తరపున అమెరికాలోని థర్డ్ పార్టీ వర్క్ సైట్లలో పనిచేసేవారికి హెచ్-1బీ వీసా జారీని కఠినం చేస్తూ కొత్త పాలసీ తెచ్చింది. ఫిబ్రవరి 22 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త పాలసీ ప్రకారం థర్డ్ పార్టీ వర్క్‌సైట్‌లో హెచ్-1బీ వీసా కోరుతున్న ఉద్యోగి పనిచేయాల్సిన అవసరాన్ని, వారి నైపుణ్యాన్ని కంపెనీలు నిరూపించాలి. హెచ్-1బీ వీసాదారు వర్క్ కాంట్రాక్ట్ ఎంతకాలముంటే అంత కాలానికే వీసాలు జారీ చేస్తామని, ఒకవేశ వీసాల్ని పొడిగించుకోవాలనుకుంటే తాజా నిబంధనల్ని పాటించాల్సిందేనని అమెరికా ఇమిగ్రేషన్ విభాగం తెలిపింది. ఉద్యోగి తరపున వీసా దరఖాస్తు సమయంలోనే ఆ వివరాల్ని సమర్పించాలని సూచించింది. భారతీయ కంపెనీల తరపున హెచ్-1బీ వీసాదారులు పని చేసే కంపెనీలను థర్డ్ పార్టీ వర్క్సైట్లు అంటారు.













