కాల్గరీ కెనడాలో ఘనంగా జరిగిన దేవి శరన్నవరాత్రి వేడుకలు
* కెనడాలోని శ్రీ అనఘా దత్త సొసైటీ ఆఫ్ కాల్గరీ షిర్డీ సాయిబాబా మందిరంలో ఆలయ నిర్వాహకులు లలిత మరియు శైలేష్, ప్రధానార్చకులు రాజ్‌కుమార్ శర్మ దేవి నవరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
* ఆలయ స్థాపకురాలు శ్రీమతి లలిత స్వయం సేవకులు మాధవి నిట్టల, మాధవి చల్ల మరియు శోభన సహకరించగా అనఘా అమ్మవారికి ప్రతి రోజు స్వర్ణ కవచ, బాలా త్రిపుర సుందరి, గాయత్రి దేవి, అన్నపూర్ణ దేవి, లలిత త్రిపుర సుందరి, మహా లక్ష్మీ, సరస్వతి, దుర్గ మహిషాసుర మర్దిని, శ్రీ రాజ రాజేశ్వరి అలంకారాలతో వివిధ రూపాల్లో దేవి శోభ ఉట్టిపడే అందం గా అలంకారాలు చేశారు.
* ప్రధానార్చకులు రాజ్‌కుమార్ శర్మ అమ్మవారికి ప్రతి ఉదయం షిర్డీ బాబా అభిషేకం, అమ్మవారి అభిషేకం, సర్వతో భద్ర, లింగాలతో భద్ర పూజలు, గణపతి, నవగ్రహ, శ్రీ రుద్ర, మహా విష్ణువు, మహా లక్ష్మి, సరస్వతి, దుర్గా జపము మరియు హోమములు జరిపించారు.
* ప్రతి రోజు సాయంత్రము షిర్డీ సాయిబాబా వారి హారతులు, అమ్మవారి లలిత సహస్రనామ, ఖడ్గమాల, కనకధారా స్తోత్రం సహిత కుంకుమార్చనలు, చతుర్వేద పారాయణం, సకల రాజోపచార పూజలు, హారతులు ప్రతి నిత్యం నిర్వహించారు.
* పాడ్యమి నాడు చిన్న పిల్లలకి బాలపూజలు, కన్య పూజలు, మూలా నక్షత్రం రోజు సరస్వతి పూజ, అక్షరాభ్యాసాలు, దుర్గాష్టమి నాడు సుహాసిని పూజలు, మహర్నవమి నాడు మహిషాసుర మర్ధిని పూజ, విజయ దశమి నాడు మరకత రాజరాజేశ్వరి పూజలు ఘనంగా జరిగాయి.
* నవరాత్రి శుభసందర్బంగా తొమ్మిది రోజులు వేల సంఖ్యలో పాల్గొని అమ్మవారి పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో వైభవంగా భక్తితో నిర్వహించారు.
* కెనడా శ్రీ అనఘా దత్త సొసైటీ ఆఫ్ కాల్గరీ మందిర ఆధ్వర్యంలో కెనడాలో గత అయిదు సంవత్సరాలు పంచాయతన యాగాలు, లలిత సహస్రనామ కోటి కుంకుమార్చన యజ్ఞము, షిరిడి బాబా గారి పాదుక యాత్రలు మరియు అనేక దైవ, ఆధ్యాత్మిక సంబంధిత కార్యక్రమాలు నిర్వహించారు. ఇటువంటి కార్యక్రమాలు అన్నీ భగవత్ సంకల్పముతో మరియు ఎంతో మంది వాలంటీర్లు ఉత్తర అమెరికా ఖండంలో నివసిస్తున్న స్వయంసేవకుల సహాయంతో నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన డైరెక్టర్ లలిత పేర్కొన్నారు.
* అచంచలమైన ధృడ విశ్వాసము, దైవ నమ్మకమే అన్నిటికి పునాది అని లలిత గారు తెలిపారు.













