చైనాను దాటిన అమెరికా
కరోనా దెబ్బకు అమెరికాలో పరిస్థితులు మరింత విషమంగా మారుతున్నాయి. ఆ దేశంలో వైరస్ బారిన పడి మరణించినవారి సంఖ్య 3,400 దాటింది. దీంతో కొవిడ్ తీవ్రతకు చోటుచేసుకున్న మరణాల సంఖ్య విషయంలో చైనా (3,305)ను అమెరికా దాటినట్లయింది. న్యూయార్క్లో కొవిడ్ వ్యాప్తి ఉధ్ధ•తంగా ఉంది. సోమవారం ఒక్కరోజే రాష్ట్రంలో 250 మందికిపైగా మృత్యువాతపడ్డారు. బాధితులకు చికిత్స అందించేందుకు తమ రాష్ట్రంలో అదనంగా 10 లక్షల మంది వైద్య సిబ్బంది అవసరమని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో పేర్కొన్నారు. 80 వేల మంది విశ్రాంత వైద్యులు, నర్సులు, సిబ్బంది సేవలందించేందుకు ముందుకొచ్చారు.
కరోనా నివారణకు వర్జీనియా, వాషింగ్టన్ కాలిఫోర్నియా సహా అమెరికావ్యాప్తంగా 33 రాష్ట్రాల్లో జన సంచారంపై నిషేదాజ్ఞలు విధించారు. దేశంలో ఇప్పటివరకు 10 లక్షలమందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. మరోవైపు ఎన్-95 మాస్కులను సూక్ష్మజీవిరహితంగా మార్చగల సరికొత్త యంత్రానికి ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది.













