అమెరికాలో 4 వేల మరణాలు.. 2 లక్షల పాజిటివ్ కేసులు
కరోనా కాటుకు అమెరికాలో జీవితాలు దుర్భరం అవుతున్నాయి. బుధవారం కొవిడ్‌తో ఆ దేశంలో 463 మంది చనిపోగా, 10,743 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 2 లక్షలను మించగా, మరణాల సంఖ్య 4,516కు చేరింది. అగ్ర రాజ్యాన్ని నిలువునా వణికించిన 2001 సెప్టెంబరు 11 నాటి విమాన దాడుల మృతుల సంఖ్య (3 వేలు) కంటే ఇది ఎక్కువ. న్యూయార్క్ మహా నగరంలో పుడ్ బ్యాంక్స్ వద్ద జనం ఎగబడుతున్నారు. ఇలాంటి పరిస్థితి మొదటిసారి ఎదుర్కొంటున్నా. రాబోయే వారాల్లో ఏం జరుగనుందో తెలియడం లేదు. మాకు సాయం కావాలి అని ఐదుగురు పిల్లల తల్లి లినా అల్బా వాపోయింది.
మన్హట్టన్లో లినా క్లీనర్‌గా పనిచేస్తున్న హోటల్ రెండు వారాల క్రితం మూతపడింది. మ్యూజిక్ టీచర్ బ్రిటానీ బ్రూక్స్, వెయిటర్-యాక్టర్ మాథ్యూ వైట్‌ఫీల్డ్ దంపతులు 2 రోజుల వ్యవధిలో ఉద్యోగాలను కోల్పోయారు. అద్దె, ఇతర బిల్లులు కట్టేందుకు డబ్బులేవు. మా క్రెడిట్ కార్డులు బిల్లులను కనీస చెల్లింపుతో సరిపెట్టాం. వడ్డీ మాఫీ చేయమని వేడుకున్నాం. ఇప్పుడు విద్యుత్, ఇతర అత్యవసర బిల్లులు మాత్రమే చెల్లించే స్థితిలో ఉన్నాం అని వారు తెలిపారు. అమెరికాలో 26 శాతం మందికి నెలవారీ ఇంటి ఖర్చులకు తాత్కాలిక సాయం అవసరం ఉందని ఓ అంచనా.













