టూత్ పేస్టుతో పేగు కేన్సర్!
వేప పుళ్ల పాయే. బొగ్గు పాయే. టూత్‌పేస్టు చేతికి వచ్చే. పళ్లు శుభ్రం చేసుకోవాలంటే చేతిలో బ్రష్. దానికింత పేస్టు ఉండాల్సిందే. లేకపోతే నోరు కడిగిన సంతృప్తి కూడా ఉండదు. అయితే, టూత్‌పేస్టులో ట్రైక్లోసన్ అనే బ్యాక్టీరియాను చంపే పదార్థం ఉంటుందట. అది కాసింత కడుపులోకి వెళ్లినా, పేగుల్లో ఉండే ఆరోగ్యకర, అవసరమైన బ్యాక్టీరియాను చంపేయడం వల్ల పేగు కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అమెరికాలోని మసాచుసెట్స్ ఆమ్ హెర్ట్స్ వర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
ఉత్పత్తిదారులు ఆ రసాయాన్ని వాడకుండా ఉండలేరు. వాడితే మనిషికి ప్రమాదమే అని తెలిపారు. ఎలుకలకు ట్రైక్లోసన్ తినిపించి పరిశోధనలు చేయగా వాటిలో జీర్ణ వ్యవస్థకు అవసరమయ్యే బ్యాక్టీరియా (గట్ బ్యాక్టీరియా) చనిపోయినట్లు తేలిందన్నారు. అమెరికాలో కొన్ని ఉత్పత్తులపై నిషేధం ఉన్నా మిగతా దేశాల్లో ఈ రసాయనంపై ఎక్కడా నిషేధం లేదని వివరించారు. ఇప్పటికే ఈ రసాయనం ప్రపంచం నలువైపులా సబ్బులు, టూత్‌పేస్ట్‌ల రూపంలో వ్యాపించిందని, దీనివల్ల మరింత నష్టం జరగక ముందే తక్షణ చర్యలు చేపట్టాలని హెచ్చరించారు.













