అమెరికా వర్సిటీల్లో భారీ కుంభకోణం
అవి ప్రపంచంలోనే ప్రఖ్యాత యూనివర్సిటీలు అక్కడ చదివితే మహా గొప్ప అనుకునే వాళ్లెందరో. మరి అలాంటి వర్సిటీల్లో చదవాలంటే ఎంట్రన్స్ పరీక్షలో కచ్చితంగా పాస్ కావాలి. దేహదారుఢ్య పరీక్షల్లో నెగ్గాలి. కానీ, పలువురు హాలీవుడ్ స్టార్లు రూ.కోట్ల లంచాలిచ్చి దొంగ దారి లో తమ పిల్లలకు సీట్లు ఇప్పించుకున్నారు. యేల్, స్టాన్‌ఫర్డ్, జార్ట్‌టౌన్, యూనివర్సిటీ ఆప్ సదరన్ కాలిఫోర్నియా, తదితర ప్రఖ్యాత యూనివర్సిటీలు, పాఠశాలల్లో తమ పిల్లలకు సీట్లు ఇప్పించుకునేందుకు భారీ కుంభకోణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ స్కాంలో డిస్పరేట్ హౌజ్‌వైఫ్ నటి ఫిలిసిటీ హఫ్‌మన్, లోరి లాగ్లిన్, సహా 50 మందిపై పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. నిందితుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు, పైనాన్షియర్లు, ఓ వైన్ తయారీదారు, ఫ్యాషన్ డిజైనర్ ఉన్నారు. కాలిఫోర్నియాకు చెందిన విలియం సింగర్ అనే వ్యక్తి బోగస్ చారిటీ సంస్థను నెలకొల్పి, వీరివ్దద డబ్బులు సేకరించి సీట్లు ఇప్పించినట్లు చార్జిషీటులో పేర్కొన్నారు.దివ్యాంగుల కోసం కేటాయించిన సీట్లపైనే వారు కన్నేసినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. దివ్వాంగుల సీట్లకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినట్లు పేర్కొన్నారు.
అమెరికా ప్రభుత్వమే ఓ బోగస్ యూనివర్సిటీ సృష్టించి భారతీయ విద్యార్థులకు వలపన్ని అరెస్టు చేసిన ఇటీవల ఉదంతం తెలిసిందే. డాలర్ డ్రీమ్స్‌తో ఆ వర్సిటీలో చేరిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన విద్యార్థులతో పాటు ఇతర రాష్ట్రాల వారు నానా పాట్లు పడ్డారు. ఇప్పుడు పేరుగాంచిన వర్సిటీల్లోనే భారీ అక్రమాలు చోటుచేసుకోవడం, లక్షల డాలర్లు చేతులు మారడం గమనార్హం.













