వరల్డ్ ఫుడ్ ప్రైజ్ సదస్సుకు హాజరవుతున్న చంద్రబాబు
అమెరికాలోని అయోవా నగరంలో జరిగే వరల్డ్ ఫుడ్ ప్రైజ్ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతున్నారు. అక్టోబర్ 19వ తేదీన అయోవా యూనివర్సిటీ నిర్వహిస్తున్న ఈ సదస్సులో ముఖ్య వక్తగా చంద్రబాబు పాల్గొంటున్నారు. వ్యవసాయరంగానికి సంబంధించి వివిధ ఒప్పందాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయోవా యూనివర్సిటీకి కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. 1987 నుంచి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ ప్రముఖులకు అవార్డులను అందజేస్తున్నది. వ్యవసాయరంగంలో, ఆహార పంపిణీలో ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులను ఫౌండేషన్ అందజేస్తోంది. అయోవా విశ్వవిద్యాలయ ప్రతినిధి దిలీప్‌కుమార్ స్వయంగా మే నెలలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానపత్రాన్ని అందజేశారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు అప్పుడే ముఖ్యమంత్రి అంగీకారాన్ని తెలియజేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్టోబర్ 18వ తేదీన చికాగో చేరుకుని అక్కడ నుంచి అయోవా వెళుతారు. 19వ తేదీ మధ్యాహ్నం ముఖ్య సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారు. అదేరోజు రాత్రి ముఖ్యమంత్రి గౌరవార్థం అయోవా విశ్వవిద్యాలయం డిన్నర్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ డిన్నర్‌కు పలువురు సిఇఓలు, సిఎఫ్‌ఓలు, ఎంట్రప్రెన్యూరర్లు హాజరవుతున్నారు. 20వ తేదీన ముఖ్యమంత్రి చికాగో చేరుకుని అక్కడ నుంచి ఇండియాకు తిరిగి వస్తారు. సిఎంతోపాటు ముఖ్యమైన సిబ్బంది మాత్రమే ఈ పర్యటనలో ఉంటారని చెబుతున్నారు. సిఎంఓ నుంచి ఓ అధికారి, వ్యక్తిగత సహాయకుడు, మీడియా అడ్వయిజర్ పరకాల ప్రభాకర్, ఎపిఇడిబి సిఇఓ కే.జె. కృష్ణకిశోర్ కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు.













