అమెరికాలో చిక్కుకున్న భారత ఎన్నికల కమిషనర్
భారత దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సునీల్ అరోరా ప్రయాణ సదుపాయాలు లేకపోవడంతో అమెరికాలో చిక్కుకుపోయారు. ఆయన వ్యక్తిగత పని మీద అమెరికా వెళ్ళారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఆయన ఈ నెల 4న తిరిగి స్వదేశానికి రావలసి ఉంది. కోవిడ్ 19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించడం కోసం అమలు చేస్తున్న ఆంక్షల్లో భాగంగా భారత దేశం- అమెరికా మధ్య అంతర్జాతీయ విమానాల రాకపోకలను మార్చి మూడో వారం నుంచి నిలిపేసిన సంగతి తెలిసిందే.
ఎన్నికల సంఘం అధికార ప్రతినిధి మాట్లాడుతూ సీఈసీ సునీల్ అరోరా వ్యక్తిగత పని మీద మార్చి 10న అమెరికా వెళ్ళారని, ఆయన ఈ నెల 4న తిరిగి రావలసి ఉందని చెప్పారు. ప్రస్తుతం ఆయన అమెరికా నుంచి ఎన్నికల కమిషన్‌తో సంబంధాలు నెరపుతున్నట్లు వివరించారు. భారత ఎన్నికల సంఘంలో సీఈసీ సునీల్ అరోరా, ఇద్దరు కమిషనర్లు అశోక్ లావాసా, సునీల్ చంద్ర ఉన్నారు.













