చాగంటి కోటేశ్వరరావును సత్కరించిన ఆంధ్రా అసోసియేషన్
నాగ్‌పూర్‌లో ఉన్న ఆంధ్రా సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఏర్పాటు చేసిన బ్రహ్మశ్రీ డా. చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమాలు అద్భుతంగా జరిగాయి. నార్త్అంబజారి రోడ్డులో ఉన్న అమృత్భవన్లోని నాగ్‌పూర్ ఆంధ్ర అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన ఈ ప్రవచన కార్యక్రమానికి తెలుగు వాళ్ళేకాకుండా మరాఠీయులు కూడా పెద్దసంఖ్యలో హాజరుకావడం విశేషం. నాగపూర్, రాయపూర్, బిలాసపూర్, భిలాయి, దుర్గ్, ముంబై, కలకత్తా తదితర అనేక ప్రాంతముల నుండి తెలుగు వారు కొన్ని వందల సంఖ్యలో వచ్చి, పాల్గొన్నారు ”శ్రీ వేంకటేశ్వర వైభవం” అనే అంశంపై చాగంటి ప్రవచనం వినిపించారు.
వేంకటేశ్వర స్వామి ఎంత సనాతనమైన దైవమో, వేంకటాచలము కూడా అంతే సనాతనమైనదనీ, కత, త్రేతా, ద్వాపర, కలియుగములలో వషాచల, అంజనాచల, శేషాచల, వేంకటాచలములుగా ప్రశస్తిపొందిన ఆ పర్వతము యొక్క మహాత్యమును చాగంటి తన ప్రవచంలో తెలియజేసారు. పురాణములు ఎంత సనాతనమైనవో అంత నవీనములు కూడా అనీ, అవి కేవలము పుణ్య సముపార్జనకే కాక మనకు దయనందిన జీవితములో నడవడికను నేర్పుతాయనీ, పురాణములే వ్యక్తిత్వ వికాసానికి కూడా పట్టుకొమ్మలనీ వివరించారు.
ఆంధ్ర అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్. మురళీధర్, కార్యదర్శి పిఎస్ఎన్ మూర్తి, సంయుక్త కార్యదర్శి పి.టి శర్మ, కోశాధికారి జెవి రావు తదితరులు చాగంటి కోటేశ్వరరావు దంపతులను ఘనంగా సత్కరించి అభినందన పత్రాన్ని బహూకరించారు. మధుసూదన పెన్న కార్యక్రమ వ్యవహారాలను చూశారు. ఎం నాగేశ్వరరావు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.













