BRS: డల్లాస్‌లో ఘనంగా బీఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకలు.. హాజరైన కేటీఆర్, ఇతర నాయకులు
బీఆర్‌ఎస్ (BRS) పార్టీ రజతోత్సవ వేడుకలకు అమెరికాలోని డల్లాస్ (Dallas) వేదికైంది. పార్టీ 25 ఏండ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకొని ఫిస్కోలోని డా. పెప్పర్ ఎరీనాలో భారాస రజతోత్సవం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. వేలసంఖ్యలో అమెరికావ్యాప్తంగా నుండే గాక ప్రపంచవ్యాప్తంగా తరలివచ్చిన భారాస కార్యకర్తలతో సభాస్థలి గులాబీమయమైంది. తెలంగాణా నినాదం మారుమ్రోగింది. ఈ సంబురాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమం రజతోత్సవ సభ లాగా జరిగింది.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఎన్నికలు ఉన్నప్పుడు కూడికలు తీసివేతలు ఉంటాయని, 2023 ఎన్నికల్లో భారాసకు ప్రజాస్వామ్య బలం తగ్గినప్పటికీ తెలంగాణ రాష్ట్రంపై తమకున్న ప్రేమ తగ్గదు, ఆగదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. తమ పాలన ఆసాంతం ఉద్యమ స్ఫూర్తితోనే కొనసాగిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణా మట్టివాసనను అమెరికాకు మోసుకొచ్చిన ప్రవాసులు తమ శ్రమను, సమయాన్ని అభివృద్ధికి వినియోగించడం ఆనందించాల్సిన విషయమన్నారు. తెలంగాణా రత్నాలుగా, భరతమాత ముద్దుబిడ్డలుగా, తెలుగుతేజాలుగా అమెరికాలో అందరూ రాణించాలని ఆకాంక్షించారు. తెలంగాణా నినాదాన్ని గట్టిగా-గర్వంగా చాటిచెప్పాలని సూచించారు. గత ఎన్నికల గురించి ప్రస్తావించిన కేటీఆర్ బిడ్డ పుట్టినాక తల్లికి అనారోగ్యం వస్తే బిడ్డను మరో కుటుంబ సభ్యునికి అప్పగిస్తారని, అలానే ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రం వేరే పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ త్వరలోనే ఆ బిడ్డ తమ చేతికి వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. గాలివాటంగా వచ్చిన రాష్ట్రం తెలంగాణా కాదని, ఎందరో అమరవీరుల పోరాటంతో..కేసీఆర్ 14ఏళ్ల మొక్కవోని పట్టుదలతో సాధించుకున్నదని ఆయన వెల్లడిరచారు. బోధించు-సమీకరించు-పోరాడు అన్న అంబేడ్కర్ నినాదమే కేసీఆర్ ఊపిరి అని ఆయన అన్నారు.
2015లో తాను తొలిసారిగా మంత్రిని అయ్యాక అమెరికాలో పర్యటించిన జ్ఞాపకాలను కేటీఆర్ నెమరవేసుకున్నారు. రోజుకి 12గంటలు సమావేశాలతోనే సరిపొయేదని, ఈ సందర్భంలో ఒక కాన్సులేట్ అధికారి తమ నిజాయితీని మెచ్చుకున్నారని గుర్తుచేసుకున్న కేటీఆర్..తమ నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదని రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి అని అందుకే తాము పదవిగానో, బరువుగానో గాక తమ బాధ్యతగా రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్నామని తెలిపానని అన్నారు. ప్రస్తుతం కృత్రిమ మేధస్సు అందరిని కంగారుపెడుతోందన్న కేటీఆర్ మార్పు ఉన్న చోట భయం, ఆందోళన ఉంటాయని అన్నారు. క్లిష్ట సమాయాలను దాటగలిగేది మార్పును స్వీకరించగలిగే గట్టి మనుషులేనని కేటీఆర్ అన్నారు.
ప్రస్తుత భారతీయ విద్యార్థుల ఇబ్బందుల దృష్ట్యా అమెరికాలో భారాస ఆధ్వర్యంలో ఒక ఎన్నారై లీగల్ సెల్ అమెరికాలోనే ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని వెల్లడించారు. శతాబ్దపు మార్పులు దశాబ్దాల్లో, ఏడాది మార్పు ఒకరోజులో జరుగుతున్న ప్రస్తుత సాంకేతిక యుగంలో భారతదేశ గతిని మార్పులతో ముందడుగు వేయించిన పీవీ నరసింహారావును, కేసీఆర్ పోరాట పటిమను ఆదర్శంగా తీసుకుని ప్రవాసులు ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. కర్మభూమిలో కార్యదక్షులుగా రాణిస్తున్న తెలంగాణ బిడ్డలు అందరూ జన్మభూమిలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి కాముకులు కావాలని తారకరామారావు ఆకాంక్షించారు. దీనికి ముందు ఎన్నారై భారాస అమెరికా విభాగ అధ్యక్షుడు తన్నీరు మహేష్ స్వాగతోపన్యాసం చేశారు. ఎన్నారై భారాస గ్లోబల్ కన్వీనర్ బిగాల మహేష్ సభికులకు ధన్యవాదాలు తెలిపారు. గోరేటి వెంకన్న, రసమయి బాలకిషన్, మధుప్రియ తదితరుల సంగీత విభావరి అలరించింది. ప్రవాస చిన్నారులు, మహిళలు తెలంగాణా సంస్కృతిని ప్రతిబింబించే నృత్యాలతో అలరించారు. బతుకమ్మ వేడుకలో మహిళలు ఉత్సాహంగా ఆడిపాడారు.
కార్యక్రమంలో ఎల్.రమణ, తాతా మధు, నవీన్ రెడ్డి, గ్యాదరి బాలమల్లు, సుధీర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి, కర్నె ప్రభాకర్, శ్రీనివాస్ రెడ్డి, బాల్క సుమన్, గువ్వల బాలరాజు, గండ్ర వెంకటరమణ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గాదరి కిషోర్, క్రాంతి కిరణ్, పైలట్ రోహిత్ రెడ్డి, కోరుకంటి చందర్, నోముల భగత్, బాణొత్ చంద్రవతి, గండ్ర జ్యోతి, దామోదర్, జాన్సన్ నాయక్, అమరెందర్ రెడ్డి, రఘువీర్ సింగ్, యుగంధర్ రావు, విష్ణువర్ధన్ రెడ్డి, అభిలాష్ రంగినేని, సోమ ఉపేందర్ గౌడ్, వంశీ రెడ్డి, అరవింద్ రావు తక్కెళ్లపల్లి, రావు కల్వల, రాజు చింతల, రాము చింతల, హరి బసేరా, శ్రీకాంత్ సురభి, పలు సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.







