మోదీ అమెరికా పర్యటన… ప్రత్యేక విందుకు జో బైడెన్ ఏర్పాట్లు!
ఈ నెల 21 నుంచి 24 వరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్లు జూన్ 22న వైట్‌హౌస్‌లో మోదీకి అధికార విందు ఇవ్వనున్నారు. అయితే అంతకుముందు రోజే (జూన్ 21న) బైడెన్ కుటుంబం ప్రధాని మోదీతో ప్రత్యేక విందు కు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఓ సీనియర్ అధికారి ఈ మేరకు వివరాలు వెల్లడించారు. జూన్ 22న వైట్‌హౌస్‌లో సౌత్ లాస్లో మోదీకి ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతకు ముందు రోజు రాత్రి మోదీతో బైడెన్, ఆయన కుటుంబ సభ్యులు కొద్దిసేపు ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశం చాలా ప్రత్యేకం. ఇద్దరు నేతల మధ్య స్నేహపూర్వక భాగస్వామ్యానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది అని తెలిపారు. త్వరలో వైట్‌హౌస్ వర్గాలు అధికారికంగా వివరాలు వెల్లడించే అవకాశం ఉందని చెప్పారు.













