ATA: ఫినిక్స్ లో ఆటా డే… తెలుగు సంస్కృతికి నీరాజనం

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఫినిక్స్ (Phoenix), ఆరిజోనా రాష్ట్రంలో ఆగస్టు 23 నిర్వహించిన ‘‘ఆటా డే సెలబ్రేషన్స్‘‘ మన తెలుగు జాతి ఐక్యతకు ఉదాహరణగా నిలిచింది. దాదాపు 4000 మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమం ఒక కన్వెన్షన్ తరహాలోనే సాగింది. ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్ల గారు బాల్టిమోర్ నగరంలో ఆటా 19 వ మహాసభలు జులై 31 నుంచి ఆగష్టు 2, 2026 వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరు తప్పక హాజరు కావలిసింధిగా విజ్ఞప్తి చేసారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆటా వేడుకలు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో డిసెంబర్ 12-27, 2025 వరకు నిర్వహిస్తున్నామని అందరు పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేసారు.
ఉదయం ప్రార్థనతో మొదలైన ఈ కార్యక్రమం రాత్రి సంగీత కచేరితో ముగిసింది. ఆది నుండి అంతం వరకు తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచింది. భక్తి ఆత్మీయత కలగలుపుల సమ్మేళనం, పండితుల వేదమంత్రాలతో, వాలంటీర్ల చిరునవ్వులతో, ఆటా బోర్డు సభ్యుల పలకరింపులతో, సాంప్రదాయ వస్త్రాలతో, శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస కళ్యాణం కన్నుల పండువగా చెవులకు ఇంపుగా, బ్రాహ్మణోత్తముల మంత్రోచ్చారణల మధ్య అన్నమాచార్య కీర్తనలతో వేదిక భక్తి రసంతో నిండిపోయింది. స్వచ్ఛంద సేవకులతో కళ్యాణ మహోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.
మధ్యాహ్నం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అబ్బురపరిచాయి. మనం అమెరికాలో ఉన్నామా లేక ఇండియాలోన అని అర్థం కాని డోలాయమానంలో పడిపోయారు ప్రేక్షకులు. తెలుగింటి బాలబాలికలు, యువతీ యువకులు, తమ ప్రతిభను ఆవిష్కరింప చేసారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు యువత గానాలు, జానపద నృత్యాలు, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతివారిని కట్టిపడేసాయి.
ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసిన సాంస్కృతిక విభాగ ప్రతినిధులు ప్రశంసలు అందుకున్నారు. తల్లిదండ్రుల కృషి శ్రమ అభిసందనీయం. మధ్యాహ్నం బిజినెస్ మీట్,జ్ఞాన వేదిక, పంచిన అమూల్య అభిప్రాయాలు వ్యాపార రంగానికి తెలుగు సమాజానికి ప్రేరణగా నిలిచాయి. ఇక సాయంత్రం సందడి చెప్పనలవి కాదు. ఫ్యాషన్ షో ఇది ఒక రంగుల హరివిల్లై నిలిచింది. దీంతో వేదిక ఉత్సాహభరితంగా మారింది. సాంప్రదాయ దుస్తులు, ఆధునిక శైలుల సమన్వయంతో వేదిక శోభిల్లింది. తెలుగు ప్రతినిధుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలాగా ఉన్నాయి ప్రదర్శనలు. రాత్రి రాగ !రారాజు నెలరాజు, తారలు తరలివచ్చి నర్తిస్తున్నట్టుగా, గందర్వులే గానం చేస్తున్నట్టుగా సుమంగళీ బృందం చేసిన గానకచేరి ప్రేక్షకులను ఉర్రూతలూగించి అడుగు కదపనీయకుండా కట్టిపడేసాయి. ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించిన ప్రతినిధుల సేవ అభినందనీయం.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా గారు, బోర్డ్ మెంబర్స్, కన్వీనర్సు, కల్చరల్ చైర్ పర్సన్స్, ఫీనిక్స్ ఆరిజోనా టీమ్, వాలంటీర్లు, ఆర్టిస్టులు, పెర్ఫామెన్సర్స్, స్పాన్సర్స్, ఇతరులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి చేసినటువంటి సమగ్ర ప్రణాళిక, కారణంగా ఆటా డే ఫీనిక్స్ సంబరాలు అద్భుతంగా జరిగాయి. ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రెడ్డి, సెక్రటరీ సాయినాథ్ రెడ్డి బోయపల్లి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నర్సి రెడ్డి గడ్డికొప్పులా, ట్రస్టీ వెన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఆటా అరిజోనా రీజినల్ డైరెక్టర్ రఘునాథ్ రెడ్డి గాడి ఇంత అత్యద్భుతంగా కార్యక్రమం నిర్వహించడానికి సహకరించిన స్పాన్సర్స్ర్ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసారు. రీజినల్ కోఆర్డినేటర్స్ సునీల్ అన్నపురెడ్డి, శుభ గాయం, మదన్ బొల్లారెడ్డి తదితరులు సహకారం అందించారు.