ఆప్త స్కాలర్షిప్ల పంపిణీ
అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్త) ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ పంపిణీ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. ఆప్త సంస్థ ప్రతినిధులు కోదండరామ్, ఉదయ్ తదితరులు మాట్లాడుతూ అమెరికాలో స్థిరపడ్డ తెలుగు వారితో 2008లో ఏర్పాటైన అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్లో ప్రస్తుతం 5వేల మందికిపైగా సభ్యులున్నారని తెలిపారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఆప్త సభ్యులంతా కలిసి తెలుగు రాష్ట్రాల్లో పేద విద్యార్థులకు చేయూతనివ్వాలని నిర్ణయించారని ఇందులో భాగంగా ఇప్పటిదాకా రూ.6 కోట్ల మేర స్కాలర్షిప్స్ అందించామని వివరించారు. 2019 సంవత్సరానికి సుమారు రూ.2 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ను అన్ని జిల్లాలలో నుంచి ఎంపికచేసిన మెరిట్ విద్యార్థులకు అందజేస్తున్నామని చెప్పారు.
హైదరాబాద్లో పాటు విశాఖపట్నం, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో స్కాలర్ షిప్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ ఏడాది 1200 మంది విద్యార్థులకు ఉపకార వేతనాన్ని ఇచ్చామని తెలిపారు. పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇతర ప్రొఫెషనల్ కోర్సులకు చెందిన విద్యార్థులకు వీటిని అందించామని వారు వివరించారు. కార్యక్రమంలో లాన్సమ్ సంస్థ చైర్మన్ ఉమేష్, లక్ష్మీతో పాటు ఆప్త ప్రతినిధులు శ్రీదేవినాయుడు, నాగరాజేంద్ర కుమార్, శ్రీకాంత్ సోమిశెట్టి సత్యనారాయణ, శివ మూలకంటి తదితరులు పాల్గొన్నారు.













