డొనాల్డ్ ట్రంప్ కు చుక్కెదురు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు న్యాయస్థానాల్లో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆరు ముస్లిమ్ దేశాల నుంచి ప్రయాణికులపై నిషేధాన్ని విధించిన ట్రంప్ కింది కోర్టులో మొట్టికాయలు తిన్న సంగతి తెలిసిందే. కాగా, దీనిపై అప్పీలుకు వెళ్లిన ట్రంప్‌కు అప్పీలు న్యాయస్థానంలో కూడా చుక్కెదురైంది. ఇక దేశ సర్వోన్నత న్యాయస్థానంపైనే ట్రంప్ ఆశలు పెట్టుకున్నారు. ఇరాన్, లిబియా, సొమాలియా, సూడాన్, సిరియా, ఎమెన్ల నుంచి ఉగ్రవాదులను అరికట్టే నెపంతో ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తూ అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఇది ఏకపక్ష నిర్ణయమని పేర్కొంటూ వివిధ సంఘాలు న్యాయస్థానాలకు వెళ్లాయి. కాగా, తాజాగా వర్జీనియాలోని రిచ్మండ్లో గల ఫోర్త్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ తాజాగా దీనిపై ఆదేశాలిస్తూ, ప్రభుత్వ వాదనను సమ్మతించలేమని, ఆయా దేశాల నుంచి ప్రయాణికులపై ఆంక్షలు విధించడం కంటే జాతి భద్రతకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. భద్రతకు సంబంధించిన ప్రభుత్వం చేస్తున్న వాదనలో పస లేదని, పిటిషనర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొంది.













