డొనాల్డ్ ట్రంప్ కు మరో ఎదురుదెబ్బ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ముస్లిం దేశాలపై విధించిన ట్రావెల్ బ్యాన్ రాజ్యాంగ విరుద్ధమని అక్కడి కోర్టు సృష్టం చేసింది. రిచ్మండ్లోని నాలుగో యూఎస్ సర్క్యూట్ కోర్టు ఆఫ్ అప్పీల్స్ ఈ మేరకు తీర్పును వెలువరించింది. ట్రావెల్ బ్యాన్పై ట్రంప్, ఇతర అధికారులు చేసిన ప్రకటనలను పరిశీలించిన అనంతరం కోర్టు 9-4 ఓట్ల తేడాతో ఇది రాజ్యాంగ విరుద్ధమని వెల్లడించింది. ట్రంప్ ట్రావెల్ బ్యాన్‌ను వ్యతిరేకించిన కోర్టులో ఇది రెండో ఫెడరల్ కోర్టు. గత డిసెంబర్లో తొమ్మిదో యూఎస్ సర్క్యూట్ కోర్టు ఆఫ్ అప్పీల్స్ కూడా ఇదే విధమైన తీర్పునిచ్చింది. నిషేధంతో ట్రంప్ తన అధికార పరిధిని అతిక్రమించారని కోర్టు పేర్కొంది. గతంలో ఇచ్చిన కోర్టు తీర్పును ఈ కోర్టు సమర్థించింది. ఇది మతం ఆధారంగా వివక్ష చూపించడమేనని తప్పుబట్టింది. ఛాధ్, ఇరాన్, లిబియా, సొమాలియా, సిరియా, యెమన్ దేశాలపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. 2017 జనవరి నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఇస్లామిక్ తీవ్రవాదం నుంచి అమెరికాను రక్షించేందుకు ఈ ట్రావెల్ బ్యాన్‌ను తీసుకొచ్చినట్లు ట్రంప్ ప్రకటించారు.













