న్యూజెర్సిలో చంద్రబాబు ప్రసంగ సభ
అమెరికాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న ఇమేజ్ నేటికీ ఏమాత్రం తగ్గలేదు. దాదాపు.. 11 ఏళ్లతరువాత.. అగ్రరాజ్యం అమెరికా నడిబొడ్డున.. న్యూజెర్సీలో తెలుగుదేశం పార్టీ జెండాలు పసుపు కళను తీసుకురానున్నాయి. ప్రతిష్ఠాత్మకంగా ప్రవాసాంధ్రులు నిర్వహించనున్న సభలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రసంగించనున్నారు. అమెరికా, కెనడా తదితర దేశాల్లోని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. పెద్ద ఎత్తున సభను విజయవంతం చేసేందుకు ఇప్పటికే సమాయత్తమయ్యారు. నెలరోజుల ముందునుంచే బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లలో వారు నిమగ్నమయ్యారు. ఇందులో ఏపీ ఎన్.ఆర్.టీ కీలక భూమిక పోషించనుంది. 2007 తరువాత 2018 అమెరికాలో తలపెట్టిన సభను విజయవంతం చేయాలని ఏపీ ఎన్ ఆర్ టీ చీఫ్ కో-ఆర్డినేటర్ బుచ్చి రామ్‌ప్రసాద్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
వ్యవసాయ సదస్సులో…
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సెప్టెంబరు 23-27 వరకూ అమెరికాలో పర్యటించనున్నారు. ఐక్యరాజ్యసమితిలో జరగబోయే వ్యవసాయ సదస్సులో పాల్గొనబోతున్నారు. అందులోభాగంగా చంద్రబాబు న్యూజెర్సీలోని ఎన్జేఐటీ(న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటుచేసిన భారీబహిరంగ సభలో పాల్గొని ప్రవాసులకు దిశానిర్దేశం చేస్తారని బుచ్చి రామ్‌ప్రసాద్ తెలిపారు. ఎన్నారై ఐలకు కూడా ఓటుహక్కు కల్పించడంపై కూడా చంద్రబాబు పలు సూచనలు చేస్తారన్నారు. అటు బోస్టన్ నుంచి వర్జీనియా వరకూ సుమారు 5000 మంది వరకూ అభిమానులు తరలి వస్తారని అంచనా వేస్తున్నట్లు బుచ్చిరాంప్రసాద్ తెలిపారు.













