విదేశీ వీసాల తాత్కాలిక రద్దు
విదేశీయులకు భారత్ మంజూరు చేసిన అన్ని రకాల వీసాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. విదేశాల్లో నివసించే భారత సంతతికి చెందిన వ్యక్తును వీసా రహిత ప్రయాణానికి అనుమతించే ఓసీఐ (ఓవర్సీస్ సిటిజన్ షిప్ ఆఫ్ ఇండియా) కార్డులకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది. ప్రస్తుతం భారత్లో విదేశీ విమానాల రాకపోకలపై నిషేధం అమల్లో ఉన్నందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. దీనివల్ల భారత్లో ఉన్న విదేశీయులకు ఎలాంటి ఇబ్బందీ రాదని, వారి వీసా గడువు ముగిసిపోయినా, ఎలాంటి ఆదనపు చార్జీ లేకుండా పొడిగింపునకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న విమాన ప్రయాణ ఆంక్షలు తొలగిన వెంటనే వారు తమ దేశానికి వెళ్లిపోవచ్చంది. భారత్లో లాక్డౌన్ తొలగించిన తర్వాత ఇప్పుడు నిలుపుదల చేసిన వీసాలు, ఓసీఐ కార్డులపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది.













