CA: పహల్గాం దుశ్చర్యను ఖండిస్తూ… కాలిఫోర్నియాలో కొవ్వొత్తుల ప్రదర్శన
పహల్గాం (జమ్మూ కాశ్మీర్)లో ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం తెలియజేస్తూ అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) ఆధ్వర్యంలో ఏప్రిల్ 24, 2025న కాలిఫోర్నియా (California) లోని మిల్పిటాస్లో కొవ్వొత్తుల ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఎన్నారైలు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఉగ్రవాదుల దుశ్చర్యకు బలైన అమాయక ప్రజలకు వారు నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ దుఃఖ సమయంలో బాధితులకు, వారి కుటుంబాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ హేయమైన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిరచారు. దాడికి పాల్పడిన వారిని చట్టపరంగా శిక్షించాలని భారత, అమెరికా ప్రభుత్వాలను అభ్యర్థించారు. ఉగ్రవాదానికి మతం, ప్రాంతం లేదని అంటూ ఇలాంటి సంఘటన హేయమైన దుశ్చర్య అని అన్నారు.
ఈ కార్యక్రమంలో శాంటాక్లారా నగర కౌన్సిల్ సభ్యులు రాజ్ చాహల్, సుడ్స్ జైన్, ఫ్రీమాంట్ నగర కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ యాంగ్ షావో, ఫ్రీమాంట్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ బోర్డ్ సభ్యుడు వివేక్ ప్రసాద్, మిల్పిటాస్ సిటీ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ సభ్యురాలు డాక్టర్ అను నక్కా, కమ్యూనిటీ నాయకులు జీవన్ జుట్షి, డాక్టర్ అనురాగ్ మైరాల్, అజయ్ భూతోరియా, సంజీవ్ కెక్, రాజీవ్ సిన్హా తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా, అసెంబ్లీ సభ్యులు యాష్ కాల్ రా, అలెక్స్ లీ, మేయర్లు కార్మెన్ మొంటానో, లియాంగ్ చావో, రాజ్ సల్వాన్, లిల్లీ మెయ్, కౌన్సిల్ సభ్యులు టీనా వాలియా, రేమండ్ లియూ, లిండా స్నెల్, ఎవ్లీన్ చువా, టెరెసా కాక్స్, యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ బోర్డ్ సభ్యురాలు రిను నాయర్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయినప్పటికీ తమ మద్దతు సందేశాలను పంపారు. తానా మాజీ అధ్యక్షుడు, కమ్యూనిటీ ప్రముఖులు జయరామ్ కోమటి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిరచారు. చివరగా కొవ్వొత్తులతో మరణించిన వారికి నివాళులర్పించడంతో కార్యక్రమం ముగిసింది.








